Sajjala Ramakrishna Reddy: అవి చంద్రన్న గుంతలు, సచివాలయ ఉద్యోగుల ఉద్యోగాలు ఎక్కడికీ పోవు, పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారు, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకే అప్పులు చేస్తున్నాం, మీడియాతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కోసం పరీక్షను చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని..ఉద్యోగులందరికీ ఇలాంటి రూల్ ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు.
Amaravati, July 26: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కోసం పరీక్షను చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని..ఉద్యోగులందరికీ ఇలాంటి రూల్ ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాలు ఎక్కడికీ పోవని.. పరీక్ష (secretariat employees written test) పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారని ఆయన వివరణ ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ టెస్టులు ఏటా ఏపీపీఎస్సీ రెండుసార్లు నిర్వహిస్తుందని.. ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. జాబ్ క్యాలెండర్‌పై టీడీపీ వాళ్లకి మాట్లాడే అర్హత లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్టుమెంట్ పరీక్ష తప్పక పాస్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు స్పష్టం చేశారు. ఐఎఎస్‌లు సహా అన్ని విభాగాల ఉద్యోగులకూ మొదట్నుంచీ ఈ విధానమే అమలవుతోందన్నారు. ప్రొబేషన్ నుంచి పర్మినెంట్ అయ్యేందుకు నిబంధనల మేరకే పరీక్ష ఉంటుంది. పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పొడిగిస్తారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ టెస్టు తప్ప మరో పరీక్ష ఉండదు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ ఒక్కరి ఉద్యోగం పోదు.. ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదు’’ అని వివరించారు.
రాజధాని అమరావతిలో వైసీపీ నేతలు రహదారి కంకర అమ్ముకుంటున్నారని వస్తున్న ఆరోపణలను సజ్జల ఖండించారు. అవన్నీ అవాస్తవాలని రోడ్డుకు వేసిన కంకర అమ్ముకునే వారిని పట్టుకుని అప్పగించి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. జగన్ రాకతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తగ్గాయి. అమరావతిలో దోపిడీ దారుల ఆదాయం తగ్గింది. బహుశా వారే కంకర అమ్ముకుని ఉండొచ్చు.టీడీపీ హయాంలో కనీసం కరకట్టనూ విస్తరించలేదు.
రైతులకు కౌలు పెంచింది, కరకట్ట నిర్మిస్తున్నది సీఎం వైఎస్ జగనే. తెదేపా హయాంలో అమరావతిలో లక్షల కోట్లు అక్రమాలు జరిగాయి. రాజధాని రైతులను తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ రెచ్చగొట్టి, భ్రమల్లో పెట్టాలని చూస్తున్నారు. రూ. వందలకోట్లు దోచుకున్న వారి కలలను సీఎం జగన్ ఛిన్నాభిన్నం చేశారు. లక్షల మంది పేద ప్రజలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని సజ్జల తెలిపారు.
రహదారులపై గుంతలు పడ్డాయని టీడీపీ వారు ఎక్కడపడితే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులన్నీ ఆ పార్టీ హయాంలో దెబ్బతిన్నవే. ఆ పార్టీ హయాంలో పడిన గుంతలను పూడ్చేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. రహదారులపై పడిన గుంతలను చంద్రన్న గుంతలు అనాలి. రోడ్ల నిర్మాణానికి రూ.2 వేలకోట్లతో ప్రభుత్వం టెండర్లను పిలిచింది. వర్షాలు అయిపోయాక రహదారి పనులు ప్రారంభమవుతాయి. రాయలసీమ లిఫ్టుపై టీడీపీ వైఖరి ఏంటో చంద్రబాబు చెప్పాలి. ఆయన హయాంలోనే పాలమూరు రంగారెడ్డి తెలంగాణ కట్టింది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు గతంలో ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ దీక్ష చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు నాటి టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. రాయలసీమకు ఏవిధంగా అన్యాయం జరుగుతుందో జనంలోకి వెళ్లి టీడీపీ నేతలు చెప్పాలి. లిఫ్టు వల్ల రాయలసీమకు ఎక్కడా అన్యాయం జరగడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకెళ్లాలని కాలువలు వెడల్పు చేయాలని సీఎం నిర్ణయించారు’’ అని అన్నారు.
రాష్ట్ర అప్పులు గురించి మాట్లాడుతూ..ఎవరికైనా అవసరాలు పెరిగినప్పుడే వనరులకు మించి అప్పు చేస్తారని చెప్పిన సజ్జల కేంద్రం అడ్డగోలుగా అప్పులు చేయడం లేదా? కాదని బీజేపీ నేతలు చెప్పమనండి అంటూ మండిపడ్డారు. ‘రాష్ట్ర విభజన అనంతరం రూ.90 వేల కోట్లతో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. చంద్రబాబు దిగిపోయే ముందు మాకు రూ. 2 లక్షల 60 వేల కోట్లు అప్పు, రూ.60 వేలకోట్లు పెండింగ్ బిల్లులు అప్పగించారు. సంక్షేమం అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకే అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పు చేయకపోతే డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం.. ప్రింట్ చేసుకుంటామా.. మేము అప్పు తెచ్చిన ప్రతి పైసాకు సంపద సృష్టి జరుగుతోంది.
బడుగుల జీవితంలో ప్రగతి వస్తోంది. కొవిడ్‌తో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గింది. 20-30 వేల కోట్లు అదనంగా పెట్టాల్సి వస్తోంది. కరోనా వల్ల రాష్ట్రంలో సంక్షోభం భయంకరంగా ఉంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా? అని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. సంక్షోభం సమర్థంగా ఎదుర్కొనేందుకు రోజుకు 16 గంటలు పాటు కష్టపడి పనిచేస్తున్నారు. ధరల పెరుగుదలపై మమ్మల్ని నిలదీసే నైతిక హక్కు టీడీపీకి లేదు. చంద్రబాబు హయాంలో జరిగిన మాఫియా పాలనను ప్రజలు మరచిపోలేదు. మత పరంగా రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పోలవరం సహా రావాల్సిన నిధులను రప్పించేందుకు జీవీఎల్ సహా నేతలు చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పిస్తే భాజపా నేతలకు మంచి జరుగుతుంది’ అని సజ్జల మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.