Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈ నెలాఖరు నాటికి రూ.3 వేల కోట్ల బిల్లులు చెల్లింపు, ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గం చర్చలు
సీఎం ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Amaravati, Mar 8: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్ చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదురి సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం సజ్జల, ఆదిమూలపు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సజ్జల మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమంపై ఎప్పుటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, అందరూ కలిసికట్టుగా పనిచేయడంవల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతోందన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొలిక్కివస్తున్నాయని చెప్పారు.
కోవిడ్‌వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటినీ సమయానికి చేయలేకపోయామని తెలిపారు. చర్చల ద్వారానే ఆయా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు చెప్పారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకే సీఎం జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ఏ విషయాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ వేదికను ఏర్పాటుచేశారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుందన్నారు.
బిల్లులు పెండింగ్‌లో లేకుండా చేస్తాం : సురేష్
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను మార్చి 31లోపు క్లియర్ చేస్తామన్నారు. ఇప్పటివరకు ఉన్న జీపీఎఫ్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామన్నారు. రిటైర్మెంట్‌కి సంబంధించి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను పూర్తిగా చెల్లిస్తామన్నారు. మెడికల్ బిల్లుల్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా చెల్లిస్తామని చెప్పారు.
టీఏ, ఏపీజీఎల్‌ఐ కూడా ఇస్తామన్నారు. ఆర్థికపరమైన అన్ని అంశాలపై చర్చించామని, దీర్ఘకాలికంగా ఉండి గత ప్రభుత్వంలో కూడా పరిష్కారం కాని అంశాలపైనా స్పష్టత ఇచ్చామని, పరిష్కార మార్గం కనుగొన్నామన్నారు. ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రివర్గం ఉపసంఘం తరచూ సమావేశమవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు.