Nandyal, Mar 8: ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పులి పిల్లలు (4 Tiger Cubs) దారి తప్పి జనావాసంలోకి వచ్చిన సంగతి విదితమే. రెండు రోజులైనా తల్లి పులి (Tiger Cubs Searching for Mother) జాడ కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్‌ఫ్రారెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్ నుంచి వదులుతారు.ఈ లోపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది.