AP Local Body Polls: 4వ దశలో కూడా వైసీపీ మద్దతుదారులదే హవా, నాలుగు దశలు కలిపి 81.78 శాతం పోలింగ్ నమోదు, ఈ ఎన్నికల్లో 2.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపిన కమిషనర్ గిరిజాశంకర్
ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ (AP Local Body Polls) నమోదు కాగా నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది.
Amaravati, Feb 21: ఏపీలో నాలుగో విడత ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ (AP Local Body Polls) నమోదు కాగా నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది. తాజాగా 2,743 సర్పంచ్, 22,423 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ మెజార్టీ స్థానాలను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.
ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ (Panchayat Elections Polling) మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,743 పంచాయతీలు, 22,423 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 1163 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 89 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 10, ఇతరులు 8 చోట్ల గెలుపొందారు.
రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మీడియాతో మాట్లాడుతూ...ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని వెల్లడించారు. కలెక్టర్లు, జేసీలు, జడ్పీ సీఈవోలు సమర్థంగా పనిచేశారని కితాబిచ్చారు. ఎన్నికల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని ప్రశంసించారు. మొత్తం నాలుగు దశల్లో 2,197 పంచాయతీలు, 47,459 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు. 4 దశల్లో 10,890 పంచాయతీలకు 82,894 వార్డులకు ఎన్నికలు జరిపినట్టు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 2.26 కోట్ల మంది ఓటు వేశారని గిరిజాశంకర్ తెలిపారు. అయితే, 10 పంచాయతీలకు, 670 వార్డులకు నామినేషన్లు రాలేదని పేర్కొన్నారు. నామినేషన్లు రాని పంచాయతీలు, వార్డులపై ఎస్ఈసీకి నివేదించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గడచిన ఎన్నికల కంటే మెరుగ్గా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి ధన్యవాదాలు.ఈసీకి రిపోర్ట్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం.’’ అని గిరిజా శంకర్ తెలిపారు.