Amaravati, Feb 21: ఏపీ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు శర వేగంగా ముందుకు (Polavaram Update) సాగుతున్నాయి. ఈ రోజు పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్‌వే గడ్డర్ల మొత్తం ఏర్పాటు ప్రక్రియ (Polavaram Spillway pillers) పూర్తయ్యింది. కేవలం 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై మేఘా ఇంజినీరింగ్ సంస్థ అమర్చింది. షట్టరింగ్, స్లాబ్ నిర్మాణంపై నిపుణులు దృష్టి పెట్టారు. గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు.
గోదావరికి భారీ వరద వచ్చినా పనులు ఆగకుండా స్పిల్‌వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం జరిగింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా ఇంజినీరింగ్ (Megha Engineering and Infrastructures Limited) ప్రణాళికలు రూపొందించారు. కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లు అన్నింటినీ డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) కొలిక్కి తెచ్చింది. పూణేలో సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)లో 3–డీ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టు ద్వారా అధిక ఒత్తిడితో నీటిని పంపుతూ ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఆ వరద చూపిన ప్రభావాలను పరిశీలించిన డీడీఆర్పీ సభ్యులు.. వాటిని శుక్రవారం క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులతో అన్వయించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, సభ్య కార్యదర్శి రంగారెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య శనివారం కూలంకషంగా సమీక్షించారు. ఈ సీజన్‌లో పూర్తిచేయాల్సిన పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా డిజైన్లను ఖరారు చేస్తేనే.. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్న జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డిల అభిప్రాయంతో డీడీఆర్పీ ఏకీభవించింది. పెండింగ్‌లో ఉన్న 29 డిజైన్లను మార్చి 15 నాటికి సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని.. ఆ మేరకు డిజైన్లను ఖరారుచేయడం ద్వారా పనులకు ఆటంకం కలగకుండా చూస్తామని డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ వరప్రదాయినిగా పిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుందని డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ (డీడీఆర్‌పీ) చైర్మన్ ఏబీ పాండ్యా ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాల్లో చేపట్టిన పనులను ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్‌తో పాటు ఇతర సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏ.బి. పాండ్యా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లుకుగానూ 29 గేట్లు అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లు అమరికపై అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. పోలవరం గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా పేర్కొన్నారు. పోలవరంలో 52 మీటర్ల ఎత్తున స్పిల్వే పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. స్పిల్ వే బ్రిడ్జి 1,128 మీటర్లుకుగాను 1,105 పూర్తి చేసినట్లు తెలిపారు. 48 గేట్లకుగాను 29 గేట్లు బిగింపు పూర్తయిందని వివరించారు.
గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని పాండ్యా తెలిపారు. పోలవరం స్పిల్ వే నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని అధికారులు వివరించారు. ప్రధానంగా ఐదు అంశాలపై సమావేశంలో చర్చించారు. వరదల సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ విషయం కూడా చర్చకు వచ్చింది.