AP Panchayat Elections 2021: ఏకగ్రీవాలను స్వాగతించాలని కోరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్, సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన గౌతం సవాంగ్
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections 2021), వ్యాక్సినేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Amaravati, Jan 27: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections 2021), వ్యాక్సినేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ (CS Adityanath Das), డీజీపీ గౌతం సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు హాజరయ్యారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారి సంజయ్ అదే బాధ్యతలు చూస్తారన్నారు. అయితే మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలు తీసుకోవాలని సూచించారు. తరువాత స్థానాల్లో సంక్షేమం కూడా తీసుకోవాలని, కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిమ్మగడ్డ సూచించారు. వెబ్‌కాస్టింగ్‌తో ఉపయోగం లేదని, పోలింగ్ కేంద్రం చుట్టూ కొంత ప్రాంతాన్నే అది కవర్ చేస్తుందని నిమ్మగడ్డ ( Nimmagadda Ramesh Kumar) వ్యాఖ్యానించారు.
వెబ్‌కాస్టింగ్ కోసం కొత్త యాప్‌ను తీసుకువచ్చామని, ఆ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల దగ్గర జరిగేదంతా తెలుసుకోవచ్చునని అన్నారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో వ్యాక్సినేషన్ ఆగకూడదని అన్నారు. యాప్ ద్వారా వీడియోలతో పాటు ఎస్ఎంఎస్ కూడా పంపవచ్చునని రమేష్ కుమార్ పేర్కొన్నారు.
సమీక్ష అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Gautam Sawang) మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి రావటం వల్ల.. పోలీసులకు కలిగే ఇబ్బందులను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లాం అని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది రాకుండా.. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందిలో.. ఆరోగ్య సమస్యలున్నవారి విషయంలో మినహాయింపులపై ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై 13 జిల్లాల ఎస్పీలు.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కోడ్ ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఎన్నికల నియమావళి గ్రామ పంచాయతీలకు, మండల ప్రజాపరిషత్తులకు, జిల్లా ప్రజాపరిషత్తులకు, నగర పంచాయతీలకు, మునిసిపాలిటీలకు, మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు వర్తిస్తుందని ఎస్ఈసీ ఓ ప్రకటన చేశారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు అధికారులనూ బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం. ఈ నెల 29 నుంచి పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది.