Second Wave in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే 82 మంది మృతి, బుధవారం నుంచి మధ్యాహ్నం కర్ఫ్యూ అమలు, మద్యం అమ్మకాల వేళలు కుదింపు
మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు కూడా తిరగడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మద్యం దుకాణాలు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి....
Amaravathi, May 4: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజూవారీ కేసులు మంగళవారం 20 వేల మార్కును దాటాయి. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, ఆక్సిజన్ కొరత మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమాశంలో కీలకంగా చర్చ జరిగింది. సరిపడా వ్యాక్సిన్ పంపిణీకి ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాగే ఆక్సిజన్ కొరతను నివారించడానికి కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇక వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి ఏపి ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూను అమలు చేయనుంది. ఇకపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులకు అనుమతి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు కూడా తిరగడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మద్యం దుకాణాలు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,15,784 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 20,034 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 11,84,028 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 11,81,133గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధికంగా 2,398 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు నుంచి 2,318 , అనంతపూర్ నుంచి 2,168 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 82 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 8,289కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 12,207 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 10,16,142మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,59,597 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.