AP Panchayat Elections 2021: అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్, నేను హోం మంత్రి అయిన తరువాత మీ సంగతి చూస్తా, పోలీసులపై బెదిరింపులకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే, శ్రీనివాస్‌రెడ్డి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని తెలిపిన నిమ్మగడ్డ
వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, నిమ్మాడ సర్పంచ్ అభ్యర్ధి అప్పన్న, అతని కుటుంబ సభ్యులపై దాడి, బెదిరింపులకు పాల్పడిన కేసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు (AP TDP chief Atchannaidu) 14 రోజుల రిమాండ్‌కు ఆదేశిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Amaravati, Feb 2: ఏపీలో పంచాయితీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ ముదిరింది. కొన్ని చోట్ల దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, నిమ్మాడ సర్పంచ్ అభ్యర్ధి అప్పన్న, అతని కుటుంబ సభ్యులపై దాడి, బెదిరింపులకు పాల్పడిన కేసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు (AP TDP chief Atchannaidu) 14 రోజుల రిమాండ్‌కు ఆదేశిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం అచ్చెన్నాయుడిని (Atchannaidu) కోట బొమ్మాళి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అచ్చెన్నను జిల్లా జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడుపై ఐపీసీ సెక్షన్ 147,148,324,307,384,506, 341,120(b),109,188, రెడ్ విత్ 149, ఐపీసీ 123(1), ఆర్‌పీఏ 1951 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు సహా మొత్తం 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. A1 నిందితునిగా కింజారపు హరిప్రసాద్, A2గా కింజారపు సురేష్, A3గా అచ్చెన్నాయుడు, A4గా కింజారపు లలితకుమారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ‘‘నేను నాయకులను కాదు.. పోలీసులను తప్పుపడుతున్నాను. డీఎస్పీ, సీఐలు నా బెడ్రూమ్ లోకి చొరబడ్డారు. నోటీసులు ఇస్తే నేనే వచ్చేవాడిని కదా.. ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి కలుగుతోంది. పోలీసులను చూసి ఉద్యోగులు కూడా సిగ్గు పడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా... రేపు అధికారం మాదే. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే నేనే హోంమంత్రిని. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. అక్రమ అరెస్టు కారకుల్ని వదిలిపెట్టబోం’’ అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే, ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై (AP Local Body Polls) కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన.. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అరోగ్యకరమని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు జరిగితేనే గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయనేది పిడివాదమని అభిప్రాయపడ్డారు.ప్రజాస్వామ్యం లో భిన్నస్వరాలు వినబడాలని, అప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుందని, ఇదే రాజ్యాంగం బాధ్యత అని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు గ్రామాల్లోని ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు ఎన్నికల నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటించారు. అక్కడ సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యుల్ని ఎస్‌ఈసీ పరామర్శించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. అయినా ప్రతిదీ రాజకీయం చేయడం తగదని సూచించారు. పోస్టుమార్టం పారదర్శకంగా జరిపిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. గొల్లగుంట పంచాయతీ ఎన్నికల అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. జిల్లాలో ఏర్పాట్లన్నీ బాగున్నాయని నిమ్మగడ్డ కితాబు ఇచ్చారు.