Atchannaidu Kinjarapu (Photo-Twitter)

Amaravati, Feb 2: ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును నిమ్మాడలో మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నిమ్మాడలో ఎటువంటి సంఘటనలు తెలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని అదుపులోకి (TDP Chief Accennaidu Arrested) తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌కి తరలించారు.

విజయసాయిరెడ్డి పర్యటన నేపథ్యంలో నిమ్మాడలో భారీగా పోలీసులు మోహరించి భద్రత ఏర్పాటు చేశారు. నిమ్మాడ సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కింజరాపు అప్పన్నపై ఇటీవల టీడీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని విజయసాయిరెడ్డి పరామర్శించనున్నారు. అప్పన్నతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులకు భరోసా ఇచ్చేందుకు ఆయన నిమ్మాడలో పర్యటిస్తున్నారు.

ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో నిన్న కేసు నమోదైన సంగతి తెలిసిందే. పంచాయితీ ఎన్నికల్లో ( AP Panchayat Elections 2021) వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించారు. తర్వాత ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో నిమ్మాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిమ్మాడ పంచాయతీలో ఇతర పార్టీకి చెందిన (అనుబంధ సభ్యులు) నామినేషన్ వేస్తే ఇబ్బందులు సృష్టించారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు/ రామ్మోహన్ నాయుడు ప్రాబల్యం ఉన్న సంగతి తెలిసిందే.

పోలవరం ఊసే లేదు, ఫిషింగ్ హార్బర్ చెప్పుకునేంతగా లేదు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారు, బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

నిమ్మాడ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెపై పోటీకి వైసీపీ నుంచి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కొడుకైన కింజారపు అప్పన్న బరిలోకి దిగారు. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను వెళ్లారు. వీళ్లిద్దర్ని అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ అడ్డుకున్నారు. మూడు రోజులుగా నిమ్మాడ రగిలిపోతోంది. అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు.

అయితే ఆయన బంధువే వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు. ఇక్కడే అసలు వివాదం రాజుకుంది.పంచాయతీ తొలివిడత నామినేషన్లలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంపై కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు అయింది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా.. అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్న అరెస్ట్ విషయం తెలిసి ఆయన నివాసం వద్దకు భారీగా పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు . ఉత్తరాంధ్రపై జగన్ రెడ్డి కక్ష కట్టారని అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని చెప్పారు. నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవు. ప్రశాంతగ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరు..? అని ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్లాడా..?..అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టారా….? అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

పంచాయితీ ఎన్నికల్లో జగన్ సర్కారు తొలి బోణీ, అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండకిందతాండ పంచాయతీ ఏకగ్రీవం, ప్రెసిడెంట్‌గా ఎన్నికైన పార్వతి భాయ్

పంచాయతీ ఎన్నికల వేళ అచ్చెన్నాయుడి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నిమ్మాడలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్ళిన వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరులపై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చెయ్యలేదని ఆరోపించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, గొల్లలగుంట గ్రామంలో టిడిపి బలపర్చిన సర్పంచి అభ్యర్థి పుష్పవతి శ్రీనివాసరెడ్డిని హత్య చేశారని చెప్పారు. తాజాగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని.. ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో సీఎం జగన్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని లోకేష్ అన్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో వారి కుటుంబ సభ్యులను కాదని ఎవరైనా సర్పంచ్‌గా పోటీచేస్తే వారిని చంపేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. జనవరి 31న కింజరాపు అప్పన్న నామినేషన్‌కు వెళితే ఆయన్ను, తనను చంపేందుకు కింజరాపు హరిప్రసాద్, సురేష్‌లతో పాటు 400 మంది మారణాయుధాలతో వెంటపడ్డారని శ్రీనివాస్‌ చెప్పారు. పోలీసులు, దేవుడి దయవల్ల బతికి బయటపడినట్టు తెలిపారు.

శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవా రం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట వేసిన నామినేషన్‌ చింపేశారని, ఆ తర్వాత మళ్లీ చివరి క్షణంలో పోలీసుల సమక్షంలో నామినేషన్‌ వేయించినట్టు చెప్పారు. ఎన్నికల నామినేషన్లలో గానీ, ఏకగ్రీవాల్లో గానీ ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ చెప్పారని, మరి అచ్చెన్న కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలన్నారు.

నిమ్మాడలో కింజరాపు కుటుంబాన్ని కాదని నామినేషన్‌లు వేసిన చాలామంది హత్యకు గురైనట్టు శ్రీనివాస్‌ ఆరోపించారు. కింజరాపు సూరయ్య, ఎచ్చెర్ల సూర్యనారాయణ, కింజరాపు భుజంగరావు(బుజ్జి), కొంచాడ బాలయ్యలను హత్య చేయించినట్టు చెప్పారు. రిగ్గింగ్‌ను అడ్డుకున్న కూన రామారావుని కత్తితో పొడిచి చంపారని వివరించారు. కోటబొమ్మాళితో పాటు 48 పంచాయతీల్లో ఎప్పుడూ రిగ్గింగ్‌ జరుగుతోందని, ఈ సారి దానిని అడ్డుకోవాలని అధికారులను కోరారు. అచ్చెన్నాయుడు, హరిప్రసాద్, సురేష్‌లను వెంటనే అరెస్ట్‌ చేయాలని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.