Amaravati. Jan 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ( AP Panchayat Elections 2021) నామినేషన్ల ఘట్టం ఈరోజు సాయంత్రంతో ముగిసింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో (AP Panchayat Elections 2021 Nominations) ఏకగ్రీవాలు కూడా జోరు మీదున్నాయి. ఇందులో భాగంగా తొలి విజయాన్ని అధికార పార్టీ వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండకిందతాండ అనే పంచాయతీ (Kondakindatanda Panchayat) ప్రెసిడెంట్ అభ్యర్థి యునానిమస్ గా ఎన్నికయ్యారు.
ఆ పదవికి పార్వతి భాయ్ అనే ఎస్టీ మహిళ ఒక్కరే నామినేషన్ వేశారు. పార్వతీ భాయ్ కి జగన్ పార్టీ సపోర్ట్ చేయటం, గ్రామంలో ఆలయం నిర్మిస్తానంటూ ఆమె ముందుకు రావటంతో మిగతావాళ్లు ఎవరూ పోటీకి దిగలేదు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ( AP Panchayat Elections) ఏకగ్రీవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డులకి ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ పదవులకు 13 వేలకు పైగా నామినేషన్లు.. వార్డు పదవులకి 35 వేలకి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు.
నామినేషన్లు వేసేందుకు డెడ్ లైన్ పూర్తి కావటంతో రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి వాటిని పరిశీలించనున్నారు. కొన్ని చోట్ల నామినేషన్లలో అనుకోకుండా తప్పుడు వివరాలు ఇవ్వటం గానీ, ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను దాచటం గానీ చేస్తే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. దీంతో ఇంకొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయే అవకాశాలున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు చాలా చోట్ల యునానిమస్ గా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లాలో మూడు, విశాఖ జిల్లాలో తొమ్మిది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి చొప్పున ప్రెసిడెంట్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.