File images of AP CM Jagnmohan Reddy and Opp Leader Chandrababu Naidu | Photo - PTI

Amaravati, Jan 31: ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఎన్నికల కమిషనర్ పొగిడారు. వైఎస్సార్‌ వద్ద పని చేయడం వల్లే తన కెరీర్‌లో గొప్ప మలుపు వచ్చిందని చెప్పారు. ఆయన వద్ద మూడేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన తనను, ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్‌భవన్‌లో ఉన్నత బాధ్యతల కోసం పంపించారన్నారు. అలా వెళ్లిన తాను అక్కడ ఏడేళ్లు ఉండిపోయి ఎలక్షన్‌ కమిషనర్‌ను అయ్యానని వివరించారు. రాజ్‌ భవన్‌ ఆశీస్సులతోనే తనకు ఈ పదవి వచ్చిందన్నారు.అందువల్ల తన హృదయంలో వైఎస్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.

ఇక సుప్రీంకోర్టు, హైకోర్టుల స్పష్టమైన తీర్పుతో పంచాయతీ ఎన్నికలను (AP Local Body Polls) ఇక ఏ శక్తీ ఆపలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అన్నారు. శనివారం వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడప కలెక్టరేట్‌లో పంచాయతీ ఎన్నికలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడం తన విధి అని, రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల నిర్వహణ చేపట్టామన్నారు.

2006లో 36 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతున్నాయన్నారు. బలవంతంగా ఏకగ్రీవాలకు పాల్పడటం తగదని, ఆ దిశగా ప్రభావితం చేసే వారిపై షాడో బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయం అని, ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు ఉండవని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం పనితీరు బాగుందని, పనితనం ఉన్న వారిపై ఆరోపణలు రావడం సహజమే అన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్‌‌ను తిప్పి పంపిన ఏపీ ప్రభుత్వం, ఎస్‌ఈసీకి ఆ అధికారం లేదని వెల్లడి, గవర్నర్‌తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

తానెప్పుడూ నిజాన్ని నిర్భీతిగా, ధైర్యంగా చెబుతానన్నారు. ఇటీవల కొన్ని పరిణామాల వల్ల వచ్చిన సీబీఐ కేసుల్లో తాను ప్రధాన సాక్షినని, రేపు కోర్టులో నిలబడి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చాలా విషయాల్లో ఇదివరకే సాక్ష్యం చెప్పానన్నారు. ఇలాంటి కేసుల్లో సాక్ష్యం చెప్పే వారికి కోర్టు అనేక రక్షణలు ఇచ్చిందన్నారు. అందువల్ల నిర్భీతితో తాను చెప్పాల్సింది చెబుతానన్నారు.

పార్టీయేతర ప్రాతిపదికన జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల (ap Local body polls 2021) సందర్భంగా మంత్రులెవరూ పల్లెల్లో పర్యటించే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వోద్యోగులెవరినీ వెంట తీసుకెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వ వాహనాలతో సహా ఇతరత్రా ఏ ప్రభుత్వ సదుపాయాలను వారు వినియోగించకూడదని శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కోడ్‌ అమలులో ఉందని.. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికైనా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ వాహనాలను సమకూర్చవద్దని నిమ్మగడ్డ పేర్కొన్నారు.

ఏకగ్రీవాలను స్వాగతించాలని కోరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌, సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన గౌతం సవాంగ్

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో (AP Panchayat Elections 2021) ప్రతిపక్ష టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. మేనిఫెస్టో విడుదలపై వివరణ కోరిన ఎస్‌ఈసీ.. శనివారం టీడీపీకి నోటీసులు జారీచేసింది. ఫిబ్రవరి 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే ఊళ్లన్నీ వల్లకాడుగా మారుతాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? అనే దానిపై టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో 175 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం పౌరులుగా మనందరి బాధ్యత అని బాబు సూచించారు. ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోడానికి సిద్దంగా ఉండాలన్నారు.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి వెలంపల్లి పశ్చిమ నియోజకవర్గంలో‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనరా?? లేక ఒక రాజకీయ పార్టీ నాయకుడా??? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ జిల్లాలు తిరుగుతూ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ రాజ్యాంగ వ్యవస్థలో ఉండి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కించపరిచే విధంగా ప్రవర్తిస్తే ప్రజలు ఉపేక్షించరని చెప్పారు. నిమగడ్డ తాత్కాలికంగా లబ్ధి పొందటమే తప్ప అంతిమ విజయం జగన్మోహన్‌రెడ్డిదేనని తేల్చిచెప్పారు. నిమ్మగడ్డ వ్యవహార శైలి రిటైర్మెంట్ తర్వాత టీడీపీ నాయకుడిగా.. లేకపోతే రాజకీయ రంగ ప్రవేశానికి తాపత్రయ పడుతున్నట్లు ఉందని వెలంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశకు నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తిఅయింది. సాయంత్ర 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు సమయం ఉండటంతో ఆఖరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.