Bhimavaram Businessman Murder: భీమవరం రొయ్యల వ్యాపారి దారుణ హత్య, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో హత్య చేసిన మృతదేహం, ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు
కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన వీరాస్వామి, కోదండ రామారావుల మధ్య రొయ్యల వ్యాపారం విషయంలో కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్నాయని సమాచారం.
Bhimavaram, Feb 16: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన రోయ్యల వ్యాపారి రెడ్డి కోదండరామారావు (Kodandarama Rao) నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన అతని భార్య లీలాకుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆయ కోసం గాలించగా.. దారుణ హత్యకు గురయినట్లుగా కనుగొన్నారు. భీమవరం బలుసుమూడికి చెందిన రామారావును ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో దారుణంగా హత్య (Bhimavaram Businessman Murder) చేశారు.
నగదు లావాదేవీలే హత్యకు గల కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన వీరాస్వామి, కోదండ రామారావుల మధ్య రొయ్యల వ్యాపారం విషయంలో కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్నాయని సమాచారం. వీరస్వామి, గుమస్తా మోహన్‌లపై మృతుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే విశాఖ ఏజెన్సీ ముంచం గిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కిల్లో రాజమ్మ భర్త కిల్లో నాగేశ్వరరావును ఆదివారం రాత్రి మావోయిస్టులు అపహరించారు. తీవ్రంగా కొట్టి వదిలిపెట్టారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. మూడో విడతలో రేపు (బుధవారం) ఈ పంచాయతీకి జరగనున్న ఎన్నికల్లో రాజమ్మ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆదివారం రాత్రి బూసిపుట్టు పంచాయతీ డి.కంఠవరం గ్రామానికి వచ్చి నాగేశ్వరరావును తీసుకెళ్లారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని హెచ్చరించినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన మావోయిస్టులు నాగేశ్వరరావును తీవ్రంగా కొట్టి సోమవారం మధ్యాహ్నం ప్రాణాలతో విడిచిపెట్టారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులను మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది.
మావోయిస్టుల హెచ్చరికతో ఈ ప్రాంత గిరిజనులు ఓటు వేసేందుకు భయాందోళనలకు గురవుతున్నారు. బూసిపుట్టు సర్పంచ్ అభ్యర్థి రాజమ్మ ఇప్పటివరకు డి.కంఠవరంలో అంగన్ వాడీ కార్యకర్తగా పని చేశారు. ఇటీవలే రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ అభిమానిగా పోటీకి దిగారు. పోలింగ్ యథావిధిగా జరుగుతుందని, బూసి పుట్టు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కుమడ పంచాయతీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశా మని ఎస్సై పి.ప్రసాదరావు చెప్పారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.