Nara Lokesh Arrest: గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు, నారా లోకేష్‌తో సహా పలువురు టీడీపీ నేతలు అరెస్ట్, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు, నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన ఇన్‌ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ బాబు, బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన హోంమంత్రి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ (Nara Lokesh Arrest) చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు.
Guntur, August 16: గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ (Nara Lokesh Arrest) చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. వివరాల్లోకి వెళ్తే, గుంటూరులో ఉన్నాది చేతిలో దారుణ హత్యకు (Engineering student murdered in Guntur) గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా తదితర నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
ఈ క్రమంలో రాజకీయ లబ్ధి కోసమే నారా లోకేశ్ వచ్చారంటూ వైసీపీ శ్రేణలు (YSRCP) ఆరోపించాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు (AP Police) టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్, నరేంద్ర, ఆనంద్ బాబు, ఆలపాటి రాజా లతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు.లోకేశ్ ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ వాహనంలోకి ఎక్కే సమయంలో నారా లోకేశ్ పిడికిలి బిగించి, చేయెత్తి టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచారు. మరోవైపు మిగిలిన నేతలను నల్లపాడు పీఎస్ కు తరలించారు. లోకేశ్ అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తన రాజకీయ జీవితంలో నారా లోకేశ్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి.
Nara Lokesh Arrest
కాగా రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. అయితే జీజీహెచ్ వద్దకు వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించకుండా విపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్ వద్ద టీడీపీ, వామపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు బైఠాయించి నిరసనకు దిగారు.
టీడీపీ నేతల నిరసన
బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మృతదేహాన్ని మరో మార్గం ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి పరమయ్యగుంటలోని రమ్య నివాసానికి మృతదేహాన్ని తరలించారు.
గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై పోలీసుల దౌర్జన్యమా? అని ప్రశ్నించారు. గుంటూరులోనే సీసీ కెమెరాలు పని చేయలేదంటే అర్థమేంటన్నారు. తాజా ఘటనతో మహిళల రక్షణపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని అన్నారు.
బీటెక్ విద్యార్ధిని హత్య కేసులో నిందితుడ్ని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఇన్‌ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్ధిని హత్య దురదృష్టకరమన్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. రమ్య హత్య కేసులో శశికృష్ణను అరెస్ట్ చేశామని వెల్లడించారు.
మీడియా ముందుకు నిందితుడు
శశికృష్ణ ఇన్‌స్టాగ్రాం ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడని.. శశికృష్ణ వేధించడంతో రమ్య దూరం పెట్టిందన్నారు. ప్రేమించకుంటే చంపుతానని శశికృష్ణ బెదిరించాడు. ప్రేమించలేదన్న కోపంతో రమ్యను హత్య చేశాడని తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్ డీఐజీ సూచించారు. మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని, మహిళల రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్నామని ఇన్‌ఛార్జ్ డీఐజీ తెలిపారు.
నిన్న గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సోమవారం జీజీహెచ్‌లో వారిని కలిసిన ఆమె ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ తాడేపల్లి ఘటనలో నిందితులను గుర్తించి ఒకరిని పట్టుకున్నాము.
సీఎం వెంటనే స్పందించి నిందితులను పట్టుకోమని పోలీసులను ఆదేశించారు. ఒక్క నిందితుడు కూడా తప్పించుకోవడానికి వీలులేదని సీఎం చెప్పారు. పార్లమెంట్‌లో దిశ చట్టం అయితే ప్రత్యేక న్యాయ స్థానాలు అందుబాటులోకి వస్తాయి. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశాం. సురక్షితంగా లేని ప్రదేశాలకు వెళ్లకూడదని ప్రజలు భావించాలి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి’’ అని అన్నారు