BTech Student Murder Case: బిడ్డ పాలిట శాపమైన సోషల్ మీడియా, గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు అరెస్ట్, సంఘటనను రాజకీయ కోణంలో చూడొద్దని కోరిన డీజీపీ గౌతమ్ సవాంగ్, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన ఏపీ సీఎం
Andhra pradesh dgp-gautam-sawang (Photo-Facebook)

Guntur, August 16: గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో (BTech Student Murder Case) నిందితుడు శశికృష్ణను అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసులు పట్టుకునే సమయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. పోలీసులను చూసి శశికృష్ణ గొంతు కోసుకోవడానికి యత్నించాడని చెప్పారు. ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ (DGP Goutham Sawang) మీడియాతో కేసు వివరాలు మాట్లాడుతూ.. రమ్య హత్యా ఘటన (B Tech Student Killed in Andhra Pradesh) అత్యంత దురదృష్టకరమని, స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నాని, నిందుతుడిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. యువతులు, మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు.

సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని, అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు.

గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య, కత్తితో మెడ, పొట్ట భాగంలో పొడిచి పరారయిన యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పాత గుంటూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

ఈ ఘటన దురదృష్టకరమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గుంటూరులో యువతి రమ్య హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలు తీసుకుని దోషికి కఠిన శిక్ష పడేలా చేయాలన్నారు.

ఘటన వివరాలు తెలియగానే హోం మంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని.. పరిహారంగా రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

బీటెక్‌ విద్యార్థిని రమ్యను హత్య చేసిన వ్యక్తికి ఉరే సరైన శిక్షని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ఆమె ఆదివారం జీజీహెచ్‌కు వచ్చి రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు వెంకట్రావు, జ్యోతిలను పరామర్శించి ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కొంప ముంచిన ఇన్‌స్ట్రాగామ్‌ పరిచయం

శశికృష్ణకు రమ్య ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైనట్టు తెలుస్తోంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో మూడు నెలలుగా గొడవపడుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరు నగరం కాకాని రోడ్డు పరమాయకుంటకు చెందిన నల్లపు వెంకట్రావు, జ్యోతి దంపతులకు మౌనిక, రమ్య(20) ఇద్దరు కుమార్తెలు. చేబ్రోలు సమీపంలోని సెయింట్‌ మేరీ‹స్‌ గ్రూప్‌ విద్యా సంస్థల్లో మౌనిక బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతుండగా, రమ్య కూడా అదే విద్యా సంస్థలో ఇంజనీరింగ్‌(బీటెక్‌) మూడో సంవత్సరం చదువుతోంది.

వెంకట్రావు, జ్యోతి దంపతులు ఏడాది కిందట కొల్లూరు మండలం చిలుమూరులో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. మౌనిక, రమ్య ఇద్దరూ పరమాయకుంటలోని తమ నివాసంలో నాయనమ్మ పుష్పలీలతో కలిసి ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కళాశాలలు లేకపోవడంతో రమ్య గత కొన్ని నెలలుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయితే పది రోజుల కిందట నాయనమ్మ వద్దకొచ్చింది. ఆదివారం చర్చికి వెళ్లే క్రమంలో బయటకు వెళ్లి టిఫిన్‌ తెచ్చుకుంది.

ఆ తర్వాత ఫోన్‌ రావడంతో నాయనమ్మతో.. ఇప్పుడే వస్తానంటూ సుమారు ఉదయం 10.20 గంటల సమయంలో రోడ్డు పైకొచ్చింది. మెయిన్‌ రోడ్‌పై బైక్‌పై ఉన్న కుంచాల శశికృష్ణతో కొంతసేపు మాట్లాడి అతడి బైక్‌ ఎక్కింది. ఇద్దరూ రోడ్డు అవతలి వైపునకు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ రమ్య బలవంతంగా బైక్‌ దిగి రోడ్డుకు ఇవతలి వైపునకు వచ్చేసింది. ఆ యువకుడు కూడా బైక్‌పై రమ్య వద్దకు చేరుకున్నాడు.

రమ్యతో వాదులాడుతూ కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత కత్తితో రమ్య మెడపై, పొత్తి కడుపులో ఆరు సార్లు పొడిచాడు. సమీపంలోని వ్యక్తి కేకలు వేయడంతో శశికృష్ణ బైక్‌పై ఆర్టీసీ బస్టాండ్‌ వైపు పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మౌనిక ఘటనా స్థలానికి చేరుకుని రమ్యను జీజీహెచ్‌కు తరలించింది. వైద్యులు రమ్యను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

నిందిడుతు దొరికాడిలా..

రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌ ఆధారంగా నిందితుడు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. శశికృష్ణ తండ్రి గురవయ్య గుంటూరులో చేపల వ్యాపారం చేస్తుంటాడు. తండ్రిని బైక్‌పై దించేందుకే ఆదివారం శశికృష్ణ గుంటూరు వచ్చాడు. ఆ తర్వాత తల్లి భూలక్ష్మి వద్దకు వెళతానని తండ్రితో చెప్పాడు. శశికృష్ణ తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి ముప్పాళ్ల మండలంలోని గోళ్లపాడులో ఉంటోంది. నిందితుడు తల్లి దగ్గరకు వెళ్లి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.

ముప్పాళ్లలోని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ సాయంతో నిందితుడి కదలికలను తెలుసుకున్నారు. గోళ్లపాడుకు సమీపంలో.. నరసరావుపేట మండలం పమిడిపాడు పొలాల్లో తిరుగుతుండగా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పక్కనే ఉన్న కాల్వలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులతో కలిసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు శశికృష్ణ తన దగ్గర ఉన్న చిన్నపాటి కత్తితో గొంతుకు ఓ వైపు కోసుకుని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే నరసరావుపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి.. చికిత్స అందించి, తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.