By-Elections 2021: రేపే తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలు, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు

Representational Image| (Photo Credits: PTI)

Amaravati, Oct 29: ఈనెల 30న తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికలకు (By-Elections 2021) సర్వం సిద్ధమైంది. ఏపీలో బద్వేల్, తెలంగాణలోని హుజురాబాద్ (Huzurabad Bypoll 2021) నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనున్న సంగతి విదితమే. ఏపీలో బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి పోలింగ్‌ సామగ్రి మొదలుకొని బారికేడ్ల ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే ప్రజాప్రతినిధుల ఎన్నికలో కీలక భాగస్వామ్యం ఓటరుదే కనుక ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు ప్రధాన పార్టీలు కూడా బద్వేలు ఉప ఎన్నికలో (Badvel Bypoll 2021) ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాయి. 2019 ఎన్నికల కంటే కూడా ఈసారి అధికంగా ఓటింగ్‌ శాతం నమోదయ్యేలా అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 22 మంది ఉన్నారు.

మొత్తం సోదా చేయడం మా విధుల్లో భాగం, వాహనాదరుల వాట్సాప్ చెకింగ్ చేయడంపై హైదరాబాద్ సీపీ క్లారిటి, మనమంతా వాట్సాప్‌ యూనివర్సిటీలో విద్యార్థులమయ్యామని వ్యంగ్యం విసిరిన అంజనీ కుమార్

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సిబ్బందికి సూచించారు. ఎన్నికల బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో గురువారం స్థానిక అర్బన్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ బూత్‌లోకి ఓటు వేసే వ్యక్తులు తప్ప ఇతరులు రాకుండా చూడాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచినీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్‌పెన్నులు, మొబైల్‌ ఫోన్లు మొదలైన వాటిని పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించకూడదని తెలిపారు. పోలింగ్‌ బూత్‌ నుంచి 100 గజాల లోపు జనసందోహం లేకుండా చూసుకోవాలని కోరారు.

ఓటుహక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో 23 చెక్‌పోస్టులు, నియోజకవర్గ సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో చెక్‌పోస్టులో పది మందిని నియమించామని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు హోటళ్లు, లాడ్జిలు, ఫంక్షన్‌ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీలు శ్రీనివాసులు, సుధాకర్, రవికుమార్, విజయకుమార్, సీఐలు, ఎస్‌ఐలు, సీఆర్‌పీ, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌ భద్రత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

ఈ నెల 30న(శనివారం) జరిగే హజూరాబాద్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పోలింగ్, కౌంటింగ్‌ ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేయించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సిబ్బంది మాక్‌ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ రోజు ఉదయం ఓటింగ్‌ ప్రక్రియ మొదలుకాక ముందు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల్లోపు మాక్‌ పోలింగ్‌ పూర్తవుతుంది. తర్వాత సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. కోవిడ్‌ కారణంగా ఈసారి రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. గతంలో పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసేది.

పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సిబ్బందికి విధుల కేటాయింపు జరగనుంది. ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 2,37,036. కాగా పురుషులు 1,17,933, స్త్రీలు 1,19,102 ఉండగా.. 14 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. 306 పోలింగ్ కేంద్రాల్లో...306 కంట్రోల్ యూనిట్స్‌తో పాటు 612 బ్యాలెట్ యూనిట్స్, 306 వివి ఫ్యాట్స్‌ను ఏర్పాటు చేశారు.