Badvel Bypoll 2021: బీజేపీ-వైసీపీ మధ్యనే బద్వేల్ ఉప ఎన్నిక పోరు, పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, జనసేన, కుటుంబ వారసత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదని తెలిపిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని (TDP not to contest Badvel bypoll) నిర్ణయించింది.
Badvel, Oct 4: కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికకు (Badvel Bypoll 2021) దూరంగా ఉండాలని టీడీపీ పార్టీ నిర్ణయించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని (TDP not to contest Badvel bypoll) నిర్ణయించింది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణికే టికెట్ ఇచ్చినందున పోటీకి టీడీపీ విముఖత వ్యక్తం చేసింది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్‌లో పోటీ చేయడం లేదని వెల్లడించింది.
వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో బద్వేల్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. పొలిట్ బ్యూరో నిర్ణయానికి ముందు బద్వేల్ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను టీడీపీ ఖరారు చేసింది. 2019లో బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే టీడీపీ టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించింది. మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనకు భిన్నంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీరియస్ కామెంట్స్ చేశారు. బద్వేల్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. వైసీపీకి భయపడాల్సిన అవసరం లేదని, కడపలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
బద్వేల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదు. బద్వేల్ ఉప ఎన్నికకు అందరూ సిద్ధంగా ఉండాలి. ఏడేళ్లుగా నిధులిచ్చి ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడేళ్ల అభివృద్ధిపై చర్చించడానికి బీజేపీ సిద్ధం. జగన్, చంద్రబాబుకు చర్చించడానికి సిద్ధమా?’’ అని సోము వీర్రాజు సవాల్ విసిరారు.