Andhra Pradesh: మదనపల్లెలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణశిక్ష విధించిన చిత్తూరు సెషన్స్ కోర్టు
ఈ కేసులో పోలీసులు ఇరవై ఎనిమిది మంది సాక్షులను హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరస్థుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.....
Chittoor, February 25: చిత్తూరు జిల్లా మదనపల్లెలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషికి చిత్తూరు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.
గతేడాది నవంబర్ 7న చిత్తూరులో జరిగిన ఒక వివాహ వేడుకకు ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు వెళ్లింది. అదే సమయంలో చిన్నారికి మాయమాటలు చెప్పి తనతో పాటు బయటకు తీసుకెళ్లిన మొహమ్మద్ రఫీ అనే 27 ఏళ్ల యువకుడు, చిన్నారిని కళ్యాణ మండపం పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు, విషయం బయట పడకుండా ఉండేందుకు చిన్నారి దారుణంగా హత్య చేసి అక్కడ్నించి పరారయ్యాడు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు తొమ్మిది రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసులు ఇరవై ఎనిమిది మంది సాక్షులను హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరస్థుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే, మరణశిక్షపై దోషికి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది.