Police Commemoration Day: పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత, పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని వెల్లడి
విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
Vjy, Oct 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్నింటికంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని చెప్పారు. ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు.
ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీలేదు. పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత. పటిష్ఠ యంత్రాంగంగా తయారు చేయడం మా కర్తవ్యం. రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వాహనాలతో పాటు పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించాం. ఏపీ పోలీసు అంటే దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని ముందుకెళ్లాం. 2014-2019 మధ్య రూ.600 కోట్లు ఖర్చు చేశాం. కొత్తగా వాహనాల కోసం రూ.150కోట్లు వెచ్చించాం. పోలీసు కార్యాలయాల మరమ్మతులు, నిర్వహణకు రూ.60కోట్లు ఖర్చుపెట్టాం. రూ.27కోట్లతో ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేశాం. పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు కేటాయించామన్నారు.
సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు దీటైన పోలీసు వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. కేంద్రం ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు ముందుకొస్తోంది. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాం. దిశ పేరుతో వాహనాలకు రూ.16కోట్లు, కమ్యూనికేషన్ పరికరాల కోసం రూ.20కోట్లు పెండింగ్ పెడితే వాటినీ చెల్లించామన్నారు.
తప్పు చేసిన వ్యక్తిని వెంటనే పట్టుకునే వ్యవస్థ అవసరం. గత ప్రభుత్వం కక్ష సాధింపులే పనిగా పెట్టుకుంది. రాగద్వేషాలకు అతీతంగా పనిచేసేదే పోలీసు వ్యవస్థ. సర్వే రాళ్లపై బొమ్మ కోసం రూ.700 కోట్లు తగలేసిన వ్యక్తి జగన్. సీసీ కెమెరాల కోసం మాత్రం రూ.700 కోట్లు ఇవ్వలేకపోయారు. నేరాల తీరు మారుతోంది.. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి’’ అని చంద్రబాబు సూచించారు.