CM Chandrababu: 2019-2024 మధ్య ఒక విధ్వంస పాలన జరిగింది, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని తెలిపిన చంద్రబాబు

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

CM Chandrababu Independence Day 2024 Speech

Vjy, August 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్‌గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నాం.

1857 కంటే ముందే బ్రిటిష్‌ దుర్మార్గపు పాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఇది చైతన్యం కలిగిన ప్రాంతం. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే నిలదొక్కుకున్నాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచాం. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించాం.  2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యం, ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత ఎదగాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిర్ధిష్ట నిర్ణయాలతో పాలన సాగించబోతున్నాం. నూతన ఆలోచనలతో 15 శాతం వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. దేవుడి దయ వల్ల సాగునీటి ప్రాజెక్టులకు జులైలోనే జలకళ వచ్చింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరందిస్తాం. రైతు ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం మా ప్రభుత్వ విధానం. గత ప్రభుత్వ అసమర్థతతో దెబ్బతిన్న పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తాం.

యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు. అందుకే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. దీంతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తాం. గత ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉచిత ఇసుకపై నిర్ణయం తీసుకున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాం. మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాం.

ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగస్వాములు. వాళ్లకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సూపర్‌ సిక్స్‌తో 6 హామీలు ఇచ్చాం. రాష్ట్ర పరిస్థితిపై ఏడు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశాం. పోలవరం, అమరావతి, రాజధాని, విద్యుత్‌ వంటి శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయిస్తాం. అక్రమార్కులను శిక్షించి తీరుతాం’’ అని చంద్రబాబు తెలిపారు.

ఐదేళ్లలో ప్రజల కష్టాలు, ఆవేదన చూసి మేనిఫెస్టో చేశాం. హామీ ప్రకారం మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాం. ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశాం. కేబినెట్ ఆమోదంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మాది పేదల ప్రభుత్వం. పేదల సేవలో ముందుండే ప్రభుత్వం.పేదల పింఛన్లు పెంచాం. దివ్యాంగుల పింఛన్ డబుల్ చేశాం. ఒకటో తేదీనే 96 శాతం పింఛన్లు పంపిణీతో రికార్డ్ సృష్టించామన్నారు