CM Jagan Delhi Tour: ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ వెంటనే పూర్తి చేయండి, హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేసిన ఏపీ సీఎం జగన్
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు.
Amaravati, June 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో (CM Jagan Delhi Tour) భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్ జోనల్ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు-వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ కూడా పెండింగులో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం మరోమారు హోంమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీంతో పాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపైనకూడా సీఎం, హోంమంత్రితో(AP CM Meets Amit Shah) చర్చించారు. ఇదిలా ఉంటే...గురువారం ఢిల్లీ టూర్‌కు వెళ్లిన జగన్ నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్‌లతో భేటీ అయ్యారు.
అయితే అమిత్ షాతో భేటీ గురువారం సాధ్యపడలేదు. దీంతో రాత్రి ఢిల్లీలోనే బస చేసిన జగన్... శుక్రవారం ఉదయం 10 గంటలకు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నానికే జగన్ తాడేపల్లి చేరుకున్నారు.