CM Jagan Tirupati Tour: రూ.684 కోట్లతో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్, తిరుమలలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
తిరుమల బ్రహ్మోత్సవాల్లో.. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు,అలాగే పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం కోసం సీఎం జగన్ తిరుమలలో పర్యటించారు
Tirumala, Sep 18: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన కొనసాగుతోంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో.. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు,అలాగే పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం కోసం సీఎం జగన్ తిరుమలలో పర్యటించారు. పర్యటలో భాగంగా శ్రీపద్మావతిపురంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించారు సీఎం జగన్. ఈ ఫ్లైఓవర్ రూ.684 కోట్లతో నిర్మించారు.అలాగే గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీకి సంబంధించి.. ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభించారు సీఎం జగన్.
సీఎం జగన్ మాట్లాడుతూ..ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. జీవో ఇచ్చేసిన పరిస్థితి నుంచి.. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించాం. ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా. దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్‌కు సంబంధించి.. 37 కోట్ల రూపాయలకు సంబంధించి హాస్టల్స్ ప్రారంభించడం వల్ల మెరుగైన వసతులు విద్యార్థులకు అందనున్నాయి.వకులమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి టీటీడీకి ఇవ్వడం జరగనుంది. అన్నింటికంటే సంతోషం కలిగించే అంశం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశాం. రూ. 313 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి.. 3,518 మందికి సంబంధించి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో 280 కోట్లు ఖర్చు చేసి మరో మూడు వేల మందికి ఇస్తాం. ఈ ప్రక్రియ కూడా నెల నుంచి 45 రోజుల్లో పూర్తి చేస్తాం.
దాదాపు 600 కోట్ల రూపాయలతో.. ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం. ఇది అన్నింటికి కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే రోజు ఇది. 22ఏలో అమ్మాలనుకున్న ఇవ్వలేని పరిస్థితిలో సతమతమవుతా ఉన్న పరిస్థితుల్లో నేను ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకువచ్చిన ఆ సమస్యను పరిష్కరించి సుమారు 8,000 మందికి పైగా నుంచి విముక్తి కల్పించాం. 8,050 మందికి తిరుపతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 2,500 చంద్రగిరిలో 22 ఏలో నుంచి తొలగించి ఉపశమనం కలిగించడం జరిగింది. ఇవన్నీ దేవుడి దయతో చేసే అవకాశం కలిగింది. ఈ నాలుగేళ్లలో మంచి జరగాలని కోరుకుంటూ అడుగులు వేశాం.
ఇవాళ రూ. 1300 కోట్ల రూపాయలకు సంబంధించిన పలు కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషం కలిగించింది. మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటూ సెలవని సీఎం జగన్ అన్నారు.