Andhra Pradesh Students in UN: ప్రపంచ ప్రఖ్యాత వేదికపై మాట్లాడిన ఏపీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అమలవుతున్న సంస్కరణలపై స్పీచ్
Andhra Pradesh Students in UN (Photo-X)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 - 28) పర్యటిస్తోంది. కాగా ఇలా పర్యటించడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.

ఇప్పటి వరకు గ్రామాలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్) సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని పొందడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి ఈ విద్యార్థులు మాట్లాడనున్నారు. దీంతో పాటుగా ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సధస్సులో ప్రదర్శిస్తారు.

 ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్‌ కాలేజీ, రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలని తెలిపిన సీఎం జగన్

అంతే కాకుండా ఆ సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సీఎం జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో పిల్లలు వివరిస్తారు.

ఈ పిల్లలు పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కొందరు దినసరి కూలీలు కాగా మరికొందరు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్‌లుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కాగా ఈ అంతర్జాతీయ పర్యటన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన పిల్లలకు వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, చర్చించడానికి, వ్యక్తీకరించడానికి, కొత్త ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ప్రపంచ వేదికను అందించడమే. ఈ పర్యటన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా & నమ్మకంతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

కొలంబియా యూనివర్సిటీలో ప్రత్యేక సదస్సులో ఏపీ విద్యార్థులు

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి ఏపీ నుంచి వెళ్లిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆదివారం కొలంబియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో పాలుపంచుకున్నారు. ఇక్కడి సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌లోని విద్యా విభాగం డైరెక్టర్‌ రాధికా అయ్యంగార్‌ ఆధ్వర్యంలో ‘ఎడ్యుకేట్‌ ఎ చైల్డ్‌’ లెక్చర్‌ నిర్వహించారు.ఇందులో పాల్గొన్న ఏపీ విద్యార్థులు.. మాల శివలింగమ్మ, మోతుకూరి చంద్రలేఖ, గుండుమోగుల గణేష్, దడాల జ్యోత్స్న, సి.రాజేశ్వరి, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, వంజివాకు యోగేశ్వర్, షేక్‌ అమ్మాజాన్, సామల మనస్విని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలను వివరించారు.

ముఖ్యంగా సీఎం జగన్‌ నాయకత్వంలో విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు­లకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు..,టాబ్లెట్‌లు, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం వల్ల విద్యారంగం ఎలా మారిందో.. తాము ఎలా ప్రగతి సాధించామో వివరించారు. మనబడి నాడు–నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా పేద విద్యార్థులకు ఎంత మేలు జరుగుతోందో వివరించారు.

తమలాంటి 42.62 లక్షల మంది విద్యార్థులకు సీఎం జగన్‌ నాయకత్వంలోని ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా ఉందని విద్యార్థులు వివరించారు. సమీప భవిష్యత్‌లో తాము కూడా జగనన్న విదేశీ విద్యాదీవెన ప్రథకం ద్వారా ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు. ఈ సందర్భంగా యూఎన్‌ఓ గ్లోబల్‌ స్కూల్స్‌ ప్రోగ్రామ్‌ ఎక్సట్రనల్‌ అఫైర్స్‌ అధికారి అమెండా అబ్రూమ్, సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జెఫ్రీ డి సాచ్‌తో ప్రత్యేకంగా సమావేశమై మన విద్యా విధానాలు, బోధనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ట్యాబ్స్, నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రతిభ గలవారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు.

మధ్యాహ్నం జరిగిన ఎకో అంబాసిడర్స్‌ వర్క్‌షాప్‌లో సైతం పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా యూఎన్‌ఓ స్పెషల్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈనెల 20న జర్నలిస్ట్‌ అండ్‌ రైటర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్‌ జే కాలేజ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్‌లో జరిగే ఎస్‌డీఎస్‌ సర్వీస్‌ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల వెంట సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు ఉన్నారు.