Swechha Programme in AP: జగన్ మరో సంచలన కార్యక్రమం, రూ.32 కోట్లతో ఉచితంగా బడికి వెళ్లే బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్లు, నాడు – నేడు పథకం ద్వారా స్వేచ్ఛ కార్యక్రమం

మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోని 28 రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉందని, ఇది అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) పేర్కొన్నారు.

Swechha Programme in AP (Photo-Twitter/ AP CMO)

Amaravati, Oct 06: సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోని 28 రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉందని, ఇది అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) పేర్కొన్నారు.

చరిత్రను మార్చే శక్తి రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోందన్నారు. మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా విద్యార్థినులకు రూ.32 కోట్లతో నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్లు (Swechha Programme in AP) ఉచితంగా పంపిణీ చేసే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి పోస్టర్‌ విడుదల చేశారు.

రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని, వారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ‘స్వేచ్ఛ’ ద్వారా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలకు వైఎస్సార్‌ చేయూత స్టోర్స్‌ ద్వారా తక్కువ ధరకే నాప్‌కిన్స్‌ (sanitary napkins) సరఫరా చేసేందుకు పీ అండ్‌ జీ (విస్పర్‌), నైన్‌ బ్రాండ్‌ల ప్రతినిధులు సీఎం జగన్‌ సమక్షంలో సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారినుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు.

AP CMO Tweet

దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో దాదాపు 23 శాతం మంది చిట్టితల్లుల స్కూల్‌ చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌ సఫ్లై అండ్‌ శానిటేషన్‌ కొలాబరేటివ్‌ కౌన్సిల్‌ నివేదికలో స్పష్టంగా చెప్పారు. ఇటువంటి పరిస్ధితులు మారాలి. చిట్టి తల్లులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

బడికి వెళ్లే బాలికలు ఇబ్బంది పడకుండా పాఠశాలల్లో నాడు – నేడు పథకం ద్వారా బాత్రూమ్‌లు బాగు చేయడం దగ్గర నుంచి శుభ్రమైన నీటి సరఫరాతోపాటు ఇవాళ ప్రారంభిస్తున్న స్వేచ్ఛ కార్యక్రమం కూడా అందులో భాగంగానే చేపట్టాం. దేవుడి సృష్టిలో భాగమైన రుతుక్రమానికి సంబంధించిన అంశాలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుకోవడం తప్పు అనే ధోరణి మారాలి. ఈ పరిస్ధితి తొలగిపోయి ఇటువంటి విషయాల్లో చిట్టితల్లులకు తగిన అవగాహన కల్పించాలని సీఎం జగన్ కోరారు.

కాకినాడలో టీడీపీకి ఎదురుదెబ్బ, అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్ పావని, మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన 21 మంది టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీకి కాకినాడ మేయర్ పీఠం దక్కే ఛాన్స్

ఒక బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్‌ఎంలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. 7 నుంచి 10వ తరగతి బాలికల కోసం నెలకు ఒకసారి కచ్చితంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. నెలకు ఒకసారి జరిగే ఈ ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తున్న మహిళా అధ్యాపకురాలితో పాటు సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు కూడా పాలు పంచుకోవాలని ఆదేశిస్తున్నామని సీఎం తెలిపారు. దీంతోపాటు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ గురించి కూడా మహిళా పోలీసు బాలికలకు అవగాహన పెంపొందించాలి. ఇవన్నీ మహిళా శిశు సంక్షేమ, విద్య, ఆరోగ్యశాఖలు కలసికట్టుగా చేపట్టాలి. ఈ మొత్తం కార్యక్రమం ప్రతి జిల్లాలో జేసీ – ఆసరా పర్యవేక్షణలో జరగాలి.

స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల మందికిపైగా 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న టీనేజ్‌ బాలికలకు రూ.32 కోట్ల వ్యయంతో నాణ్యమైన, బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ ఉచితంగా అందచేస్తాం. ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్, హైజీన్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌కు చెందిన విస్పర్‌ బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌తో పాటు గోరఖ్‌పూర్‌ (యూపీ)కు చెందిన ప్రఖ్యాత నైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా నాప్‌కిన్స్‌ సరఫరా చేస్తోంది. ఒక్కొక్క చిట్టితల్లికి నెలకు పది చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందజేస్తారు. ఎండాకాలంలో వేసవి సెలవుల కంటే ముందే ఒకేసారి పాఠశాలలో పంపిణీ చేస్తారు.

సురక్షితంగా డిస్పోజ్‌కు ఇన్సినరేటర్లు

స్వేచ్ఛ పథకం అమలు కోసం ప్రతి పాఠశాల, కళాశాలలో నోడల్‌ అధికారిగా ఒక మహిళా అధ్యాపకురాలిని నియమిస్తున్నాం. సంబంధిత విద్యాసంస్థలో ఈ మొత్తం కార్యక్రమం అమలు బాధ్యతను నోడల్‌ అధికారి పర్యవేక్షిస్తారు. వినియోగించిన శానిటరీ నాప్‌కిన్స్‌ సురక్షితంగా డిస్పోజ్, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా భస్మం చేసేందుకు ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,417 ఇన్సినరేటర్లను ఏర్పాటు చేశాం. స్కూళ్లలో కూడా బాత్రూమ్‌లలోనే ఇన్సినరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మున్సిపాల్టీలలో ప్రత్యేకంగా డస్ట్‌బిన్లు అందుబాటులో ఉంటాయి. ఎలా డిస్పోజ్‌ చేయాలన్నది చాలా ముఖ్యం కాబట్టి దానిపై నోడల్‌ ఆఫీసర్‌ తగిన అవగాహన కల్పించాలి.

చేయూత దుకాణాల ద్వారా గ్రామాల్లో..

స్కూళ్లు, కళాశాలల్లో పంపిణీ చేయడంతోపాటు గ్రామ స్ధాయిలో ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవే నాణ్యమైన, బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్‌ చేయూత దుకాణాల ద్వారా వీటిని విక్రయించే కార్యక్రమం చేపడుతున్నాం. ఆయా దుకాణాల్లో ఇవి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. చేయూత ద్వారా దుకాణాలు నిర్వహిస్తున్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్ధికంగా మరో వనరు లభిస్తుంది.

నిర్వహణకు ప్రత్యేక నిధి

రాష్ట్రవ్యాప్తంగా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మనబడి నాడు – నేడు కార్యక్రమం ద్వారా రూపురేఖలు మార్చేలా నిరంతరం నీటి సరఫరాతో కూడిన బాత్రూమ్‌లను చిట్టితల్లుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే తొలిదశ నాడు – నేడు కింద 15,715 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తయింది. జూలై 2023 నాటికి అన్ని పాఠశాలల్లో నిర్మాణాలు పూర్తవుతాయి. టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా హెడ్‌మాస్టర్‌తో కూడిన పేరెంట్స్‌ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.