Lay Stone for Bhogapuram International Airport: నెరవేరనున్న ఉత్తరాంధ్రవాసుల కల, భోగాపురంలో రూ.3500కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్, పాల్గొననున్న గౌతమ్ అదానీ
విజయనగరం జిల్లాలో 3,500 కోట్ల ఖర్చుతో 2,200 ఎకరాల్లో ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించబోతోంది.
Visakapatnam, May 03: ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్రవాసులు ఎదురుచూస్తున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు(Bhogapuram international airport) సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లాలో 3,500 కోట్ల ఖర్చుతో 2,200 ఎకరాల్లో ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించబోతోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ (Bhogapuram international airport) పనులకు అంకురార్పణ చేయనున్నారు సీఎం జగన్. ముందుగా పైలాన్ ప్రారంభించి, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ముందుగా విశాఖలో పర్యటించనున్నారు. అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ అదానీ కూడా పాల్గొనననున్నారు.
మధురవాడలో 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్క్‌లో అదానీ సంస్థ 14,634 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతోపాటు తారకరామ తీర్ధ సాగరం పనులకు రూ.194.40 కోట్లతో శంకుస్థాపన, 23.73 కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన నిర్వహించి.. సవరవిల్లి వద్ద జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఉదయాన్నే తాడేపల్లి నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గౌతమ్ అదానీని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడ మధురవాడలో ఏర్పాటు చేయబోయే టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. కాపులుప్పాడలో మరో డేటా సెంటర్, టెక్‌పార్క్‌కు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.