Covishield Vaccine: తెలుగు రాష్ట్రాల్లో భద్రంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఏపీలో గన్నవరంకు..తెలంగాణలో కోఠి ఆరోగ్య కార్యాలయానికి చేరుకున్న వ్యాక్సిన్లు, రేపు జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ

ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్‌కు చేరుకుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ లోని కోఠి ఆరోగ్య కార్యాలయానికి ఈ వ్యాక్సిన్లు (Covishield Vaccine) చేరుకోగా ఏపీలో గన్నవరం శీతలీకరణ కేంద్రానికి ఈ వ్యాక్సిన్లు చేరుకున్నాయి.

COVID-19 Vaccine reached telugu states (Photo-ANI)

Amaravati, Jan 12: దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు కోవిడ్‌ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్‌కు చేరుకుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ లోని కోఠి ఆరోగ్య కార్యాలయానికి ఈ వ్యాక్సిన్లు (Covishield Vaccine) చేరుకోగా ఏపీలో గన్నవరం శీతలీకరణ కేంద్రానికి ఈ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమైంది. తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసి, ఇప్పటికే డ్రైరన్‌ కూడా పూర్తి చేసింది. వ్యాక్సిన్‌ పంపిణీలో వృధాను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన లబ్ధిదారుల నిష్పత్తి (1.19 లక్షల)కి అదనంగా పది శాతం (1.30 లక్షలు)డోసుల వ్యాక్సిన్‌ను కేటాయించింది.

ఇక కోవిషీల్డ్‌ తరలించడానికి ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్నవరంలోని (gannavaram airport) రాష్ట్ర శీతలీకరణ కేంద్రంలో భద్రపరిచి.. రేపు అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్‌ పాయింట్లకు తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్‌ డెలివరీ వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద కూలర్లు ఏర్పాటు చేశారు.

వ్యాక్సిన్‌ (Coronavirus Vaccine) భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టారు. గన్నవరం స్టోరేజ్‌ కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టోరేజ్‌ కేంద్రం వద్ద 8 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగనుంది. ఈనెల 16న వ్యాక్సినేషన్‌కు వైద్య అధికారుల ఏర్పాట్లు చేశారు.

కరోనా వ్యాక్సిన్ ఖరీదు రూ. 210, దేశంలో తాజాగా 12,584 కరోనా కేసులు నమోదు, ఏపీలో 121 మందికి కోవిడ్ పాజిటివ్‌, ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం

40 బాక్సుల్లో 4,96,680 వ్యాక్సిన్‌ డోస్‌లు ఏపీ రాష్ట్రానికి చేరుకున్నాయి. పుణె నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లను ఎయిర్‌పోర్ట్‌ కార్గో నుంచి ప్రత్యేక వాహనాల్లో.. గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. కాగా గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీకెమెరాల పర్యవేక్షణలో పటిష్ట భద్రత మధ్య వ్యాక్సిన్‌ నిల్వ చేస్తున్నారు. ఈనెల 16 నుంచి ఏపీలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుండగా.. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు

ఇక తెలంగాణలో కరోనా టీకా కోఠిలోని ఆరోగ్య కార్యాల‌యంలోని శీత‌లీకర‌ణ కేంద్రానికి చేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో 3.72 ల‌క్ష‌ల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కోఠిలోని శీత‌లీక‌ర‌ణ కేంద్రానికి చేర్చారు. అక్క‌డ ఏర్పాటు చేసిన‌ 40 క్యూబిక్ మీట‌ర్ల వ్యాక్సిన్ కూల‌ర్‌లో టీకాల‌ను నిల్వ చేయ‌నున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను త‌ర‌లించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తోంది, పుణే నుంచి వివిధ రాష్ట్రాలకు బయలుదేరిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌, ఈ నెల 16 నుంచి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం

తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయ‌నున్నారు. మొత్తంగా తొలుత 2.90 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్య సిబ్బందికి టీకా వేయ‌నున్నారు. వారంలో నాలుగు రోజులు వైద్య సిబ్బంది టీకాలు వేయ‌నుంది. బుధ‌, శ‌నివారాల్లో య‌థావిధిగా సార్వ‌త్రిక టీకాల కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు టీకా పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది.

ముందుగా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి.. ఆ తర్వాత కొవిడ్‌ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందించ‌నున్నారు. ఆ తర్వాత 50 ఏండ్లకు పైబడిన వారికి, అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్య క్రమంలో అందించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.