Cyclone Fengal Live Update: దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Vijayawada, Nov 30: నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రం తుఫాన్ గా బలపడింది. ఫెంగల్ తుఫాన్ (Cyclone Fengal) ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తమిళనాడు ప్రభుత్వం అలర్ట్
తుఫాన్ కారణంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మారుమూల ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఫెంగల్ తీరాన్ని చేరుకోకముందే, తమిళనాడు ప్రభుత్వం శనివారం ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరింది. తుఫాన్ గంటకు 70-80 కి.మీ/గం. వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.