Devaragattu Bunny Festival: కర్రల సమరానికి సర్వం సిద్ధం, రక్తపాతం జరగకుండా చూసేందుకు పోలీసుల ప్రయత్నం, గాయపడిన వారికి వెంటనే చికిత్స, నిఘా నేత్రంలో బన్ని ఉత్సవాలు
దసరా రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం రక్తం కారేలా కర్రలతో కొట్టుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.
Kurnool, October 8: కర్నూలు జిల్లా దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి చెంత జరుగుతున్న బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం రక్తం కారేలా కర్రలతో కొట్టుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. బన్ని ఉత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా జనం తండోపతండాలుగా హాజరవుతారు. ఈ ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని, రక్తం కారకుండా ఉత్సవాలు జరపాలని పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా, ప్రజలు మాత్రం తమ సంప్రదాయంలో భాగమైన కర్రల సమరాన్ని మాత్రం వదలడం లేదు. ఈ సారి కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి గారు సిసి కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ప్రతి యేటా మాదిరిగానే ఈ సంవత్సరమూ కర్రల సమరానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో ఇప్పటికే దేవరగట్టు చేరుకున్నారు. విగ్రహాల ఊరేగింపు జరిగే వీధుల్లో సీసీ కెమెరాలను అమర్చారు. ఇనుప చువ్వలు గుచ్చే కర్రలను వాడవద్దని గత 10 రోజులుగా గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇనుప చువ్వలు వాడినట్టు తెలిస్తే, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. బన్ని ఉత్సవం కోసం సిద్ధం చేసిన కర్రలను అధికారులు పరిశీలించారు. ఇక ఉత్సవంలో గాయపడిన వారికి వెంటనే చికిత్సను అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను, అంబులెన్స్ లను సిద్ధం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రశాంతంగా బన్ని ఉత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
1000 మందికి పైగా పోలీసులు, ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ ఒన్ కెమెరాలు, ఫాల్కన్, హక్, వజ్ర వాహనాలు వంటి లేటెస్ట్ టెక్నాలజీని ఈ ఉత్పవంతో ఉపయోగిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. 7 మంది డిఎస్పీలు, 30 మంది సిఐలు, 65 మంది ఎస్సైలు, 223 మంది ఎఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్ళు, 388 మంది కానిస్టేబుళ్ళు, 30 మంది మహిళా పోలీసులు, 50 స్పెషల్ పార్టీ బృందాలు, 3 పట్లూన్ల ఎఆర్ బలగాలు, 300 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధులలో ఉంటారని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు.
బన్ని ఉత్సవం వీడియో
బన్ని ఉత్సవంలో కర్రలు తగిలి గాయపడితే జరగబోయే దుష్పరిమాణాలపై దేవరగట్టు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు, లఘు చిత్రాలు, పోస్టర్లు, జనచైతన్య నాటికల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ప్రాణనష్టం, తీవ్రగాయలు కలగకుండా దేవరగట్టు సంప్రదాయాన్ని చాటిచెప్పాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు చర్యలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. బన్ని ఉత్సవంలో ఎవరైన అల్లర్లు, గొడవలు సృష్టిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే అక్కడి ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. మద్యం సేవించి రింగులు గల కర్రలతో ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలకు గాయాలు, కాళ్ళు, చేతులు విరిగే ప్రమాదాలను ప్రతి ఏడాది చూస్తున్నామన్నారు. ఏదైనా జరగరానిది జరిగితే వారిపై ఆధారపడిన కుటుంబాలు, పిల్లలు ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు.
దేవరగట్టు చేరుకునే పరిసర గ్రామాల్లోనూ, ప్రధాన రహాదారుల్లోనే కాక చిన్న చిన్న దారుల్లోనూ బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా నాటు సారా, మద్యం నియంత్రణకు ఎక్సైజ్, పోలీసుశాఖ సమన్వయంతో దాడులు చేస్తున్నామన్నారు. ఏవరైనా అక్రమంగా మద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. కాగా భక్తుల్లో మార్పు రావాలని, ఈ కర్రల సమరానికి స్వస్తి పలకాలని దేవరగట్టు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈసంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు.