Duggirala Woman Murder Case: దుగ్గిరాల మహిళ హత్య గ్యాంగ్ రేప్ కాదని తేల్చిన గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, పరామర్శకు వచ్చిన నారా లోకేష్ పైకి రాళ్లు రువ్విన ప్రత్యర్థులు
హత్య కేసులోని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ (Nara Lokesh) రావడంతో అక్కడ టెన్సన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Duggirala, April 28: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి తిరుపతమ్మ హత్య కేసులో (Duggirala Woman Murder Case) నిందితులైన సాయిరాం, వెంకట సాయిసతీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఇది గ్యాంగ్ రేప్ కాదు. తిరుపతమ్మకు అదే గ్రామానికి చెందిన వెంకట సాయి సతీష్‌కు సన్నిహిత సంబంధాలు (Police reveals illicit affair) ఉన్నాయి.
సతీష్ తరచూ తిరుపతమ్మ ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఘటన జరిగిన రోజు కూడా సాయి సతీష్ తిరుపతమ్మ ఇంటికి వెళ్లి కొంతసేపు గడిపి బయటకు వచ్చాడు. ఆ వెంటనే శివసత్యసాయిరాం తిరుపతమ్మ ఇంట్లోకి వెళ్లి తనకు కూడా సహకరించమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో శివసత్యసాయిరాం తిరుపతమ్మను చీర కొంగుతో ఉరేసి ( murder in Guntur) హతమార్చాడు' అని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళ అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. తెనాలి ఆస్పత్రిలో మృతురాలు తిరుపతమ్మ కుటుంబాన్ని మంత్రి నాగార్జున, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు సుచరిత, రామకృష్ణ రెడ్డి పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. మృతురాలి ఇద్దరు పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ కుటుంబానికి స్థలంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి తెలిపారు.
ఇక తుమ్మపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య కేసులోని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ (Nara Lokesh) రావడంతో అక్కడ టెన్సన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు టీడీపీ శ్రేణులపై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ నిలుచున్న చోటే... ఆయనకు అతి సమీపంలోనే పెద్ద రాయి వచ్చి పడింది. అయితే ఈ ఘటనలో లోకేశ్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు.
ఈ ఘటనపై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన తనపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయన్న లోకేశ్... ఈ తరహా దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తమపైకి వైసీపీ కుక్కలు రాళ్లు రువ్వాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పది మంది ఆందోళనకారులను కూడా అడ్డుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాళ్ల దాడిలో భాగంగా తన మీదకు దూసుకువచ్చిన రాయిని చూపుతూ పోలీసులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
హత్యాచార బాధితురాలి మృతదేహానికి శవ పరీక్ష జరగకముందే... ఆమెపై అత్యాచారం జరగలేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఎలా చెబుతారని లోకేశ్ ప్రశ్నించారు. అలా చెప్పాలని ఎస్పీపై ఒత్తిడి చేశారా? అని ప్రశ్నించిన లోకేశ్...సజ్జల అనే జీతగాడు ఎస్పీని ఒత్తిడికి గురి చేశారా? అని ప్రశ్నించారు. తమది పేటీఎం బ్యాచ్ కాదన్న లోకేశ్... తమది ఎల్లో బ్లడ్ అని... ఏ ఒక్కరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. హత్యాచారంపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ ప్రభుత్వానికి 21 రోజులు గడువు ఇస్తున్నానని చెప్పిన లోకేశ్... 21 రోజుల్లోగా నిందితులకు ఉరిశిక్ష వేయగలరా? అని ప్రశ్నించారు.