EC on YSRCP: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ఆగ్రహం, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు సరికాదంటూ కామెంట్స్
అదే సమయంలో ఏ పార్టీలో అయినా ఓ నేత శాశ్వత అధ్యక్షుడుగా గానీ, ఆ నేతకు శాశ్వత పదవులు గానీ వర్తించవని కూడా స్పష్టం చేసింది.
New Delhi, SEP 21: వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నోటీసులు జారీ చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా (president for life) జగన్ (YS Jagan) ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శికి పలు లేఖలు రాశామని ఈసీ వెల్లడించింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం ఒక లేఖను విడుదల చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి (Vijayasai reddy) రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో భాగంగా వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం వివిధ మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను చూసిన తర్వాత, ఇది వాస్తవమేనా? అని నిర్ధారించుకునేందుకు విజయసాయిరెడ్డికి పలుమార్లు లేఖలు రాసిందట. అయితే ఆ లేఖలకు విజయసాయిరెడ్డి నుంచి స్పందన రాకపోవడంతో ఇది వాస్తవమేనని తాము భావిస్తున్నామని, దీనిపై పార్టీలో అంతర్గత విచారణ జరిపి.. అసలు విషయమేమిటో తెలపాలంటూ తాజా లేఖలో సాయిరెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదే సమయంలో ఏ పార్టీలో అయినా ఓ నేత శాశ్వత అధ్యక్షుడుగా గానీ, ఆ నేతకు శాశ్వత పదవులు గానీ వర్తించవని కూడా స్పష్టం చేసింది. ఏ పార్టీ ఎన్నికలు అయినా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే జరగాల్సి ఉందని తెలిపింది. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా (president for life) ఎన్నికై ఉంటే.. వైసీపీ నిర్ణయం ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు విరుద్ధమేనని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ తరహా నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.