EC on Volunteers: ఏపీలో వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండాలని ఈసీ కీలక ఆదేశాలు
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను దూరంగా ఉంచాలని చెప్పింది.
New Delhi, March 31: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లపై (Volunteers) కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర సర్కారుకి సూచించింది. అలాగే, వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు సహా ఇతర పరికరాలు స్వాధీనం చేసుకోవాలని, ఎన్నికల కోడ్ ఉన్నంతవరకు ఈ ఆదేశాలు పాటించాలని చెప్పింది. సంక్షేమ పథకాల డబ్బును వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను దూరంగా ఉంచాలని చెప్పింది.
ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీ (DSC) పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎన్నికల తర్వాతే జరిగే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఏప్రిల్ 18న ఇస్తారు. మే 13న పోలింగ్ ఉంటుంది. జూన్ 4 న ఫలితాలు వెల్లడవుతాయి. జూన్ 6 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఏవైనా చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది.