Heatwave in Andhra Pradesh: ఏపీలో భానుడు భగభగలు, వారం రోజుల పాటు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక, 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు
పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
Amaravati, April 11: ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా రాజాంలో 41.8, నంద్యాల జిల్లా అవుకులో 41.6, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయనగరం జిల్లా అల్లాడపాలెంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీని విశ్లేషించినప్పుడు చాలా ప్రాంతాల్లో అసౌకర్య సూచికలు (డిస్కంఫర్టబుల్ ఇండెక్స్) పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ఎండ ప్రభావంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు.
ఎండ, ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొందంటున్నారు. వారం రోజుల పాటు ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. మంగళవారం 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అడ్డతీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజవొమ్మంగి, వరరామచంద్రపురం, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం తదితర మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.