Andhra Pradesh Rains: ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు, ఈనెల 20–22 మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
ఇది వాయవ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుంది.
Vjy, Sep 10: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయవ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుంది. వచ్చే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించనుంది. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది.
ఉత్తర కోస్తాలో నేడు రేపు భారీ వర్షాలు (Andhra Pradesh Rains), దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారిణి స్టెల్లా పేర్కొన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కవిటిలో అత్యధికంగా 62.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది.
అనకాపల్లి జిల్లా గోలుగుండలో 11.2, విజయనగరం పూసపాటిరేగలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురలో 6.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
ఇదిలా ఉంటే ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చినా ఆ తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడవచ్చని, అది ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు (AP Floods ) రాష్ట్రంలో 46 మంది ప్రాణాలు(Died) కోల్పోయ్యారని ప్రభుత్వం అధికారిక(Official) ప్రకటన విడుదల చేసింది. సుమారు 540 వివిధ రకాల పశువులు(Animals) మృతి చెందాయని వివరించింది. 4.90లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగగా, 49వేల ఎకరాల్లో ఉద్యాన , 200 ఎకరాల్లో సెరీకల్చర్‌కు నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు.
మొత్తంగా 5,921 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయని తెలిపారు. 76 విద్యుత్ ఉపకేంద్రాలు ముంపుబారిన పడగా 1,283 ఎల్టీ ఎలక్ట్రిక్ స్తంభాలు, 1,668, 11 కేవీ ఎలక్ట్రిక్ స్తంభాలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రాథమిక అంచనా మేరకు రూ. 6882 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి ప్రభుత్వం నివేదికను అందజేసింది. నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యుమరేషన్ ప్రక్రియను నిన్నటి నుంచి ప్రారంభించారు.