Raghuveera Reddy: మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రఘువీరారెడ్డి, బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా నియమాకం, రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై ఏమన్నారంటే..
ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా.
Bengaluru, April 19: కాంగ్రెస్ మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మళ్లీ పాలిటిక్స్‌లోకి రానున్నారు.శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నా. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా’ అని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ కార్యక్రమాలకు రఘువీరా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలను రఘువీరాకు అప్పగించింది. బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా తనను నియమించారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెళ్లి అక్కడి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. తనను అభిమానించేవారు చెప్పినట్లుగా భవిష్యత్తులో నడుచుకుంటానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. పదిహేను, ఇరవై రోజులుగా మనసు కలచివేసిందన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎలాంటి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ.. అసభ్యకర వ్యాఖ్యలు కానీ చేయలేదన్నారు. మోదీ అనే పేరు ఉన్న వారందరూ దొంగలని రాహుల్ గాంధీ ఎక్కడ అనలేదన్నారు. పెద్ద పెద్ద దొంగలకి మోదీ అనే పేరు ఉందని మాత్రమే అన్నారని రఘువీరా పేర్కొన్నారు. కొందరు ఆ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించి వక్రీకరించారన్నారు.
ఆగ మేఘాల మీద 24 గంటల్లోనే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. కోర్టులో శిక్ష పడి మూడు, నాలుగు సంవత్సరాలయిన వాళ్లు ఎంపీ, ఎమ్మెల్యేలు గానీ కొనసాగుతున్నారన్నారు. వాళ్ల పార్లమెంటు అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయకుండా ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయిన సాయంత్రానికే రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేయించారని.. ఈ బాధను తట్టుకోలేకపోతున్నానని రఘువీరా పేర్కొన్నారు. రాహుల్‌ను అవమానించడం వల్లే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడతారని చెప్పారు.