AP Local Body Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టిన సీఎం జగన్, నెల రోజుల్లోగా ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే జైలుకే అని హెచ్చరిక
మూడు రాజధానుల అంశం, ప్రభుత్వ ఇతర నిర్ణయాలను ప్రతిపక్షం, ముఖ్యంగా చంద్రబాబు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన పాలనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్న సందర్భంలో, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏమాత్రం గెలిచే అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఆధిపత్యం సాధించి
Amaravathi, March 3: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Polls) సీఎం జగన్ (CM YS Jaganmohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం జగన్, మార్చి నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావాలని చెప్పారు.
పంచాయితీరాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పూర్తిగా నిరోధించాలన్న ధ్యేయంతోనే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. ప్రజలను నిజమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటానికి, అలాగే ప్రజాసేవ పట్ల అంకితభావం ఉండే వ్యక్తులకు అవకాశం కల్పించడానికి ఈ ఆర్డినెన్స్ ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుందని అన్నారు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని జగన్ హెచ్చరించారు. నగదు పంపిణీ చేసినట్లు ఎన్నికల తర్వాత రుజువైనా, అభ్యర్థులపై అనర్హత వేటు ఉంటుందని, రెండు-మూడేళ్లు జైలు శిక్ష కూడా పడుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో మద్యం మరియు డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసే బాధ్యతను జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సీఎం అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల్లో లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అక్రమాలను అరికట్టే దిశగా ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రక్రియ దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
దీనిని బట్టి చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. మూడు రాజధానుల అంశం, ప్రభుత్వ ఇతర నిర్ణయాలను ప్రతిపక్షం, ముఖ్యంగా చంద్రబాబు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన పాలనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్న సందర్భంలో, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏమాత్రం గెలిచే అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఆధిపత్యం సాధించి, ఇప్పటికీ ప్రజలు తమవైపే ఉన్నారు అని సీఎం జగన్ చాలా పకడ్బందీ స్కెచ్ వేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇదిలా ఉండగా, సీఎం ఆదేశాలతో అధికారులు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. నిర్ణీత గడువులోగా ఎన్నికలు పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘాన్ని అధికారులు కోరనున్నారు.