Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అలక? కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే నెల రోజుల పాటు సెలవు

అయితే, తన పర్యవేక్షణలో పనిచేయాల్సిన ఓ అధికారి, తన పరిధిని మించి అధికారాన్ని వినియోగిస్తున్నారని సుబ్రమణ్యం కొన్ని సార్లు ఆయనపై ఆగ్రహం....

AP Ex CS LV Subhamanyam | File Photo

Amaravathi, November 6: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత హోదా అయినటువంటి ముఖ్య కార్యదర్శి (Chief Secretary) పదవి నుంచి తనను తప్పించి, ఏపీ మానవ వనరుల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేయటం పట్ల ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subrahmanyam) అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన బాపట్లలో HRD DG గా పదవీ బాధ్యతలు చేపట్టకుండానే, డిసెంబర్ 06 వరకు నెల రోజుల పాటు సెలవు పెట్టారు.  ఇంతకాలం ప్రభుత్వ సీఎస్‌గా వ్యవహరించిన ఆయనను అంతగా ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అది కూడా తన పర్యవేక్షణలో విధులు నిర్వహించే సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈ ఉత్తర్వులు విడుదల చేయడం కూడా అయనకు ఒక భారీ షాక్ అని చెప్పవచ్చు. సుబ్రమణ్యం స్థానంలో భూపరిపాలన విభాగం చీఫ్ కమీషనర్‌గా ఉన్న నీరబ్ కుమార్ (Nirab Kumar) కు చీఫ్ సెక్రెటరీ బాధ్యతలను ఈ ఉదయం అప్పగించారు.

గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం తరఫున ద్వారా జారీ చేయబడాల్సిన ముఖ్య జీవోలు, నోటీసులు అన్ని ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ నుంచే విడుదల అవుతున్నాయి. నిజానికి ఇవన్నీ సీఎస్‌గా వ్యవహరించే సుబ్రమణ్యం ద్వారా జరగాల్సిన వ్యవహారాలు. అయితే, తన పర్యవేక్షణలో పనిచేయాల్సిన ఓ అధికారి, తన పరిధిని మించి అధికారాన్ని వినియోగిస్తున్నారని సుబ్రమణ్యం కొన్ని సార్లు ఆయనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇటీవల జగన్ కేబినేట్‌లో నిర్ణయించిన కొన్ని పథకాలు ఆర్థిక శాఖ ఆమోదం తీసుకున్న తర్వాతనే మంత్రివర్గ భేటీ అజెండాలో పెట్టాల్సిందిగా ప్రవీణ్ ప్రకాశ్‌కు సీఎస్ హోదాలో సుబ్రమణ్యం సూచించారు. అయితే సుబ్రమణ్యం ఆదేశాలను ప్రకాశ్ ఖాతరు చేయకపోవడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రకాశ్ నేరుగా సీఎం జగన్ వద్ద ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం జగన్ (CM Jaganmohan Reddy), ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రకాశ్‌కు ఫుల్ పవర్స్ కట్టబెడుతూ అప్పటికప్పుడే సుబ్రమణ్యంను బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాలతో ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రకాశ్ ఏకంగా తన పైఆఫీసర్‌గా ఉన్నటువంటి సుబ్రమణ్యంను బాపట్లలోని HRD DGగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

మాజీ సీఎస్ సుబ్రమణ్యం ఈరోజు కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టకుండా సెలవుపై వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఎల్వీ సుబ్రమణ్యం పదవీకాలం మరికొన్ని నెలల్లో ముగియనుంది.