Valmiki Jayanti: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, ఇకపై ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి, ఇంతకీ మహర్షి వాల్మీకీ ఎవరు?, గొప్పతనం ఏంటీ?, ఆపేరు ఎలా వచ్చింది?, పూర్తి విశ్లేషణాత్మక కథనం మీకోసం

మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి వేడుకలు జరపాలన్నారు.

Maharshi-valmiki-jayanti-made-andhra-pradesh-state-festival (Photo- twitter)

Amaravathi, October 8: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి వేడుకలు జరపాలన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13న అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో వాల్మీకి జంయంతి వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. మొత్తం రూ.25లక్షల నిధులను కేటాయించింది. ఇందులో అనంతపురం జిల్లాకు రూ.6 లక్షలు, మిగిలిన 12 జిల్లాలకు లక్షన్నర చొప్పున కేటాయించింది. ప్రతి ఏటా అశ్వీయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లో తెలిపింది. వేడుకలకు జిల్లాలోని వాల్మీకులంతా అనంతపురానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే 2017లోనే తెలంగాణ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో వేడుకల నిర్వహణను బీసీ సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయం పట్ల బోయ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  విజయదశమి పర్వదినాన పాలపిట్టను చూడాలని చెప్తారు. ఈ పక్షిని చూడటం ద్వారా జీవితంలో ఏం జరుగుతుంది

వాల్మీకి మహర్షి పుట్టు పూర్వోత్తరాలు

వాల్మీకి మహర్షి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి. శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతని తండ్రి ప్రచేతనుడు ( Pracheta) అందుకు వాల్మీకి ప్రాచేతసుడు గా ప్రసిద్ధి పొందాడు. అటవీ తెగకు చెందిన వాడు. వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు కావున మహర్షి, రెండు కలుపుకుని వాల్మీకి మహర్షి అయ్యాడు. రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన చేసి ఆదికవి అయ్యాడు. ఆది కావ్యం రామాయణ కావ్యాన్ని 24వేల శ్లోకాలతో 7 కండాలుగా లిఖించిన గ్రంథ కర్త. రామాయణంలో మొత్తం 24వేల పద్యాలు ఉంటాయి. సంస్కృతంలో పద్యాలను రచించడం రామాయణంతోనే ప్రారంభమైందంటే దానికి కారణం మహా ఋషి వాల్మీకినే చెప్పుకోవాలి. శ్రీరాముడి కుమారులైన లవ, కుశలకు పద్యారూపంలో ఉన్న రామాయణాన్నే వాల్మీకి పాటగా నేర్పించారు.

అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుతో బతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుంచి వలస బాట పట్టారు. ఆర్యతెగకు చెందిన సప్త ఋషులచే జ్ఞానోదయమైన తర్వాత, మహర్షిగా మారి దండకారణ్యం (నల్లమల అడవులు) గుండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వెళ్లాడు. మార్గ మధ్యలో వివిధ ప్రదేశాల్లో బస చేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి తీసుకుంటూ రామాయణ కావ్యాన్ని (24వేల శ్లోకాలతో 7 కండాలు)గా దేవనాగరి లిపిలో రాస్తూ, తను వెళ్లిన ప్రదేశాన్ని కావ్యంలో పేర్కొన్నాడు.వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే సీతాదేవీ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావిస్తారు.

వాల్మీకి మహా రుషిగా ఎలా మారాడో..

మహా రుషి వాల్మీకి ఋషి ప్రచేతనకి జన్మించాడు. ప్రచేతన తన కుమారునికి రత్నాకర అని నామకరణం చేశా డు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు రత్నాకర ఆడుకోవడానికి అడవుల్లోకి వెళ్లి తప్పిపోతాడు. అలా తప్పిపోయిన రత్నాకరుడు ఒక వేటగాడికి దొరుకుతాడు. ఆ వేటగాడే రత్నాకరుడే అని తన సొంత కొడుకులాగా ఎంతో ప్రేమతో పెంచుకుంటాడు. తన వృత్తిని రత్నాకరుడికి కూడా నేర్పిస్తాడు. తర్వాత రత్నాకరుడికి పెళ్లి చేస్తాడు. తన కుటుంబ పోషణ కోసం రత్నాకరుడు వేటను కొనసాగిస్తూ ఉంటాడు. ఒక రోజు నారధుడు సప్త ఋషులతో కలిసి ఆ దారి గుండా ప్రయాణిస్తుండగా రత్నాకరుడు వారిని ఆపి వారి దగ్గరున్న ధనాన్ని ఇవ్వమని బెదిరిస్తా డు. అప్పుడు నారదముణి రత్నాకరుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. అది ఏమిటంటే నువ్విలా దారినపోయే వారి ని దోచుకొని పాపాలు చేస్తున్నావు కదా ఇదంతా ఎవరికోసమైతే చేస్తున్నావో వారు నీవు చేసిన పాపాన్ని పంచుకుంటారా? అని అడుగుతాడు. అప్పుడు రత్నాకరుడు ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని ఇదే ప్రశ్న అడుగుతాడు.

రామ నామ బోధన

దానికి తన కుటుంబ సభ్యులు పాపాన్ని పంచుకోమని తిరస్కరిస్తారు. అప్పుడు రత్నాకరుడికి ప్రవితమైన రామ నామాన్ని బోధిస్తాడు. రామనామాన్ని జపిస్తూ, ధ్యానంలో కూర్చోమని తను వచ్చే వరకు అలాగే చేయమని చెబుతారు. నారదముని తనకు చేసిన బోధన ప్రకారం రత్నాకరుడు ధ్యాన పద్ధతిలో కూర్చొని రామజపాన్ని చేస్తూనే ఉంటాడు. నారధముని రత్నాకరుని దగ్గరికి తిరిగి వచ్చేసరికి అతని శరీరం మీద పెద్ద చీమల పుట్ట పెరిగిపోతుంది. నారదుడు అతని శరీరం మీద ఉన్న చీమల పుట్టను మొత్తం తొలగించి రత్నాకరుడితో నువ్వు చేసిన ఈ తపస్సుతో బ్రహ్మదేవుడు సంతృప్తి చెందాడు. బ్రహ్మమోక్షాన్ని నువ్వు పొందావు. ఇప్పటి నుంచి నీ పేరు వాల్మీకి అని చెబుతాడు. వాల్మీకి అని నారదుడు అతనికి నా మకరణం చేయడానికి గల కారణం రత్నాకరుడు తపస్సు చేసినప్పుడు అతని శరీరం మీద చీమల పుట్ట ఏర్పడుతుంది. చీమల పుట్టను వాల్మీక అని అంటారు. కావున అతనికి వాల్మీకి అని పేరు పెట్టాడు నారధ మహర్షి.

కించపరిస్తే జైలుకే

అయితే ఈ కథపై వివాదం కూడా నడిచింది. క్రీ.పూ.నుండి అందుబాటులో ఉన్న వేదములు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా, ఎప్పుడూ దొంగగా,దారిదోపిడీదారుడిగా చెప్పలేదు. ఈ విషయాన్ని పంజాబ్ మరియు హరియానా హైకోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్, హరియానా,విశ్వవిద్యాలయము వారు ఆచార్య, డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా (మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్-జస్టిస్ భల్లా, ద టైమ్స్ ఆఫ్ ఇండియా,ఇంగ్లీష్ డైలీ, 2010 మే 22) నాటి కధనంలో కూడా చూడవచ్చు. డాక్టరు సహదేవ,చైర్ పర్సన్ గా, వాల్మీకి చైర్ అనే విభాగమును,ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు,అధ్యాపకులచే చేయించారు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జస్టిస్ భల్లా జడ్జిమెంట్‌ను ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడకూడదు, నాటికలు,టి.వి.సీరియల్స్, సినిమాలు తీయరాదు, వాల్మీకి మహర్షిని దొంగ, దారిదోపిడీదారుడు అని బోయలను, వాల్మీకులను కించపరిచే విధముగా మాట్లాడితే నేరము, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును.