పాలపిట్టగా పిలువబడే ఇండియన్ రోలర్ (Indian Roller) పక్షిని ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ అందమైన పక్షిని తెలుగు రాష్ట్రాల్లో పాలపిట్ట (Palapitta) అని పిలిస్తే, ఉత్తర భారత దేశంలో నీలకాంత లేదా నీలకంఠ పక్షి, ఇంగ్లీష్‌లో బ్లూజే ( Blue Jay) గా పిలుస్తారు. జంతుశాస్త్ర ప్రకారం ఈ పక్షి శాస్త్రీయ నామం కొరాసియాస్ బెంఘాలెన్సిస్ (Coracias benghalensis). రక్షించాల్సిన బడే అరుదైన పక్షుల జాబితాలో చేర్చబడిన ఈ పక్షి దక్షిణ భారతదేశం మరియు పశ్చిమ భారతదేశంతో పాటుగా హిమాలయాల పర్వత ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
హిందువుల ముఖ్యమైన పండగల్లో ఒకటైన దసరా పండగ నాడు చాలా మంది పాలపిట్టను చూడటం అనవాయితీగా వస్తుంది. దసరాను అతిపెద్ద పండుగగా జరుపుకునే తెలంగాణ రాష్ట్రం సహా, ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో దసరా పండగరోజు పాలపిట్టను చూసేందుకు ఉత్సాహం కనబరుస్తారు. ఈ పక్షికి సంబంధించిన ఫోటోలను కూడా మొబైల్ ఫోన్లలో, సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు పంచుకుంటారు. విజయదశమి రోజున పాలపిట్ట కనిపిస్తే అదో శుభశకునం, ఇక భవిష్యత్తులో అంతా శుభమే జరుగుతుందని చాలా మంది బలంగా నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం రావణాసురుడిని చంపేందుకు వెళ్లిన శ్రీరాముడికి విజయదశమి నాడు పాలపిట్ట ఎదురవుతుంది, ఆనాడు రాముడు దానిని శుభశకునంగా భావించాడని చెపుతారు, ఆ తర్వాత రావణుడ్ని చంపి లంకను జయించే రామాయణ గాధ తెలిసిందే. (అక్టోబర్ 13న వాల్మీకి జయంతి, ఇంతకీ మహర్షి వాల్మీకీ ఎవరు?)
ఈ పక్షి మెడభాగం నీలం రంగులో ఉండటం చేత దీనికి ఉత్తర భారతదేశంలో దీనికి నీలకంఠ పక్షి అనే పేరు కూడా ఉంది. దీనిని ఆ పరమశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే పవిత్రమైన దసరా పర్వదినాన ఈ పక్షిని చూస్తే అంతా శుభమే అని జనాల నమ్మకం.
పాలపిట్ట సోయగం ఈ వీడియోలో చూడొచ్చు
అయితే జనాల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి కొంతమంది స్వార్థపరులు ఈ పక్షులను బంధించి దసరా రోజు భక్తులకు చూపించడానికి ధరలు నిర్ణయిస్తూ దీనిని ఓ వ్యాపారంగా మలుచుకున్నారు. ఈ పక్షిని చూడటానికి ఒక ధర, ఈ పక్షిని కొని పంజరం నుంచి వదిలి విముక్తి కలిగించినందుకు మరో ధర ఇలా ఒక్కోదానికి ఒక్కో ధరను నిర్ణయిస్తున్నారు. దసరా వచ్చిందంటే వీరివద్ద తప్ప ఎక్కడా పాలపిట్ట కనిపించకుండా చేస్తుండటంతో ఈ పక్షి అంతరించిపోయే ప్రమాద స్థితికి చేరుకుంది.
పాలపిట్ట తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్ర పక్షిగా గుర్తింపు ఉంది. పర్యావరణవేత్తల ఫిర్యాదుతో 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టపై దసరా రోజు నిషేధం విధించింది. అంటే గుడి దగ్గర కానీ, మరేచోట అయినా సరే ఎవరూ పాలపిట్టను బంధించకూడదు, దానితో వ్యాపారం అసలు చేయకూడదు. దీనిని ఉల్లంఘించడం చట్టరీత్యా నేరం, కఠిన శిక్షలు కూడా విధించబడతాయి.
ఈ పాలపిట్టను ఎకో ఫ్రెండ్లీ పక్షి, రైతునేస్తంగా కూడా అభివర్ణిస్తారు. తరచుగా బహిరంగ మైదానాలలో, పంట పొలాలలో లేదా స్థానిక తోటలు, ఉద్యానవనాలలో తిరుగాడే ఈ పక్షి పంటకు పట్టిన తెగుళ్ళను ఆహారంగా తీసుకుంటుంది. పంటలను, తోటలను నష్టపరిచే చిన్న చిన్న కీటకాలు, సరీసృపాలు మరియు ఉభయచరాలను ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి రైతులకు అది పరోక్షంగా లాభాన్ని చేకూరుస్తుంది అందుకే రైతు నేస్తం అనే పేరు వచ్చింది.
ఇకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా దసరా సంబరాలు ధూంధాంగా జరుపుకోబడుతున్నాయి. చెండుపై మంచి సాధించిన గెలుపునకు ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారు. దుష్ట సంహారం చేసే దుర్గామాత ఆశీస్సులను అందుకుంటారు, ఇకపై జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా తాము చేపట్టే ప్రతీ మంచి పని విజయవంతం కావాలని అమ్మవారిని మొక్కుకుంటారు.
సోదరసామరస్యానికి ప్రతీకగా నిలిచే దసరా పర్వదినాన శత్రువులు సైతం మిత్రులు కాబడతారు. చెడును గెలిచేలా మనిషిలోని మంచితనం చుట్టూ నలుగురితో పంచుకోవడమే దసరా పండుగ అసలైన స్పూర్తి. ఇదే స్పూర్థితో ఒకరితో ఒఅకరు అలాయ్-బలాయ్ తీసుకొని, జమ్మి పత్రాన్ని ఆత్మీయులతో కలిసి ఆనందంగా పండగ జరుపుకోవాలి.
ఇక చివరగా, ఎట్టి పరిస్థితుల్లోనూ పాలపిట్టను బంధించకుండా ఆ పక్షిని స్వేచ్ఛగా ఎగరనీయండి, ఒక ప్రాణిని బంధించి కాకుండా స్వేచ్ఛగా ఎగిరినపుడు చూస్తేనే నిజమైన ఆనందం, శుభప్రదం అని గ్రహించాలి.