Mamata Banerjee on Chandrababu: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలతో చంద్రబాబుకు చిక్కులు, పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశారంటూ ఆరోపణలు..
పెగాసస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల క్రితం పెగాసస్ ను కొనుగోలు చేయాల్సిందిగా ఆఫర్ వచ్చిందని తాము నిరాకరించామని చెప్పారు. అంతేకాదు అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు.
కోల్‌కతా, మార్చి 18: వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్ వేర్ (Pegasus Software) వ్యవహారం దేశంలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచేందుకు అక్రమంగా ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్షాలు.. కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పార్లమెంట్ లోనూ వాడివేడి చర్చలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పెగాసస్ మేటర్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను కూడా తాకింది. పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. పెగాసస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల క్రితం పెగాసస్ ను కొనుగోలు చేయాల్సిందిగా ఆఫర్ వచ్చిందని తాము నిరాకరించామని చెప్పారు. అంతేకాదు అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు.
చంద్రబాబుపై పెగాసస్ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఆయన నిజంగానే కొనుగోలు చేశారా అనే దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పెగాసస్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అప్పట్లో తమకు కూడా పెగాసస్ క్రియేట్ చేసిన వారి నుంచి ఆఫర్ వచ్చిందని కానీ తాము తిరస్కరించామని స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎలాంటి పనులు చేయమని తెలిపారు. ఐతే మమతా బెనర్జీ కామెంట్స్ పై స్పందించిన ఆయన.. ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని.. దాని ఆధారంగా అలా అని ఉండొచ్చని లోకేష్ అభిప్రాయపడ్డారు. తాము నిజంగా పెహాసస్ ను కొనుగోలు చేసి ఉంటే వైసీపీ ప్రభుత్వం బయటపెట్టకుండా ఉంటుందా అని అన్నారు.
మమతా బెనర్జీ కామెంట్స్ తో వైసీపీకి మాత్రం కొత్త అస్త్రం దొరికినట్లయింది. ఇప్పటికే పలు అంశాల్లో టీడీపీ.. వైసీపీ నేతలను, ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఇప్పుడీ వ్యవహారం వెలుగులోకి రావడంతో బాబుపై మాటల తూటాలు పేల్చే అవకాశం లేకపోలేదు. ఈ అంశాన్ని వైసీపీ హైలెట్ చేస్తే.. టీడీపీ ధీటుగా ఎలా సమాధానమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డేటా చోరీ అంశం సంచలనం రేకెత్తించింది. లోకేష్ స్నేహితుడికి సంబంధించిన ఐటీ సంస్థకు అక్రమంగా కాంట్రాక్టు కట్టబెట్టడం వల్ల ప్రజల వ్యక్తిగత డేటా దుర్వినియోగం జరిగిందంటూ ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది. ఇప్పుడు పెగాసస్ వ్యవహారంలో బాబు పేరు రావడంతో మరోసారి అలాంటి వివాదమే చోటు చేసుకునే అవకాశముంది.
పెగాసస్ అంటే ఏమిటి..?
ఇజ్రాయెల్ లు కచెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అనే సంస్థ ఈ పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ ను సృష్టించింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందనే ఆరోపణలతో పెగాసస్ పై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతోంది. భారత్ లోనూ పెగాసస్ రాజకీయ వివాదాలకు కారణైంది. పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశంలోని 300 మంది ప్రముఖులపై చట్టవ్యతిరేక నిఘా కొనసాగుతోందంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ మేటర్ ను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది.