New Liquor Policy in AP: ఏపీలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ, ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, వివరాలను వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర
పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో, నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.
Vjy, Sep 11: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో, నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానంపై ఈ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరపనుంది.
అంతేకాకుండా, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. ఇప్పటికే అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి రూపొందించిన నివేదికను ఈ సబ్ కమిటీ పరిశీలించనుంది. నూతన మద్యం విధానంపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది.
గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఏపీ అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. సొంత ఆదాయం పెంచుకునేలా ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేసిందని మండిపడ్డారు. నాటి మద్యం పాలసీ కారణంగా ప్రజల ఆరోగ్యం నాశనమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై బుధవారం కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగిందని తెలిపారు.
మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ రూపొందించినున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ విధానాలు, నాసిరకం మద్యం కారణంగా ఏపీలో గంజాయి వినియోగం పెరిగిందని ఆరోపించారు.