No License If Convicted In Alcohol Cases: మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్, ఏపీలో కొత్త మద్యం పాలసీ, కొత్తగా అమల్లోకి వచ్చిన పాలసీ విధానాలు గురించి ఓ సారి తెలుసుకోండి

ఇందులో భాగంగానే దశల వారీగా మద్య నియంత్రణ చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం(Alcohol ban) అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు గట్టిగా వేస్తున్నారు.

No License If Convicted In Alcohol Cases (Photo-pexels (representational photo )

Amaravathi, November 26: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మద్యపాన నిషేధం పై దృషి సారించారు. ఇందులో భాగంగానే దశల వారీగా మద్య నియంత్రణ చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం(Alcohol ban) అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు గట్టిగా వేస్తున్నారు.

ముందు బెల్ట్ షాపులకు చెక్ పెట్టి , ప్రభుత్వమే (Andhra Pradesh government) మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ(new bar policy) అమలు చేస్తున్న సర్కార్ జనవరి 1 నుండి బార్ల పైన కూడా నూతన విధానం అమలు చెయ్యనుంది.

జనవరి 1 నుంచి బార్ల కేటాయింపులో నూతన పాలసీకి ప్రభుత్వం పదును పెట్టింది. ఆ మేరకు నియమ నిబంధనలతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విధానం ప్రకారం.. పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా బార్లు, మైక్రో బ్రూవరీలు ఉండవు. మద్యం కేసుల్లో శిక్ష పడిన వారు, 21 ఏళ్ల లోపు వయస్సున్న వారు, ప్రభుత్వానికి ఎక్సైజ్‌ రెవెన్యూ ఎగవేతదారులకు, కుష్టు వ్యాధి, ఇతర వ్యాధులున్న వారికి లైసెన్సులు మంజూరు చేయరు. బార్‌ను కనీసం 200 చదరపు మీటర్లలో ఏర్పాటు చేయాలి. వాటికి అనుబంధంగా ఏర్పాటయ్యే రెస్టారెంట్, కిచెన్‌ 15 చదరపు మీటర్లలో ఉండాలి.

ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

గుర్తింపున్న విద్యా సంస్ధలకు, దేవదాయ శాఖ గుర్తించిన దేవాలయాలు, వక్ఫ్‌బోర్డు గుర్తింపున్న మసీదులు, రిజిస్టర్డ్‌ క్రైస్తవ సంస్థలు నిర్వహించే చర్చిలకు, ఆస్పత్రులకు 100 మీటర్లలోపు బార్లు ఏర్పాటు చేయరాదు. జాతీయ, రాష్ట్ర రహదార్లకు 500 మీటర్ల లోపు దూరంలో ఉండకూడదు. అక్టోబర్‌ 2, ఆగష్టు 15, జనవరి 26 తేదీలను డ్రై డేలుగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం తగ్గించి వాటి సంఖ్యను ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రకటిస్తారు. దరఖాస్తు , లైసెన్సు ఫీజుల్ని ప్రకటించారు.

బార్ల లైసెన్స్‌కు నియమ నిబంధనలు

బార్, మైక్రో బ్రూవరీని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రెండు కి.మీ. పరిధిలోనూ, కార్పొరేషన్లలో 5 కి.మీ. పరిధిలో ఏర్పాటు చేయాలి. దరఖాస్తు రుసుం రూ.10 లక్షలు రుసుం చెల్లించాలి. దీన్ని తిరిగి ఇవ్వరు. స్టార్‌ హోటళ్లు, బ్రూవరీలను మినహాయించి మిగిలిన 797 బార్లలో 40 శాతం తగ్గించి 478 బార్లకే లైసెన్సులిస్తారు. ఉదాహరణకు ఏదైనా మున్సిపాలిటీలో పది బార్లుంటే వాటిలో నాలుగుకు తగ్గిస్తారు. అదే ఒక బార్‌ ఉంటే అలానే ఉంచుతారు. బార్‌కు దరఖాస్తు చేసుకునే వారు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి. లేదా ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్ట్‌ యాక్టు–2006 ప్రకారం లైసెన్స్‌ పొందాలి.

వ్యాపార వేళలు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటలు మాత్రమే ఉంటాయి. అయితే ఆహార సరఫరా 11 వరకూ ఉంటుంది. త్రీస్టార్, ఆపైస్థాయి హోటళ్లకు వ్యాపార వేళలు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు, ఆహార సరఫరా అర్ధరాత్రి 12 వరకు ఉంటుంది. లైసెన్సు మార్పిడి, కొత్త లైసెన్స్‌ ప్రకటన ఎక్సైజ్‌ కమిషనర్‌ అనుమతితోనే ఉంటుంది. ఎక్సైజ్‌ చట్టం 31, 32 ప్రకారం లైసెన్స్‌ రద్దు చేసే, ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.