AP Local Body Polls: ఈ సారి నోటా ఓట్ల లెక్కింపు, తొలి దశ పంచాయతీ ఎన్నికలకు రేపే పోలింగ్, 12 జిల్లాల్లో 2,724 గ్రామ పంచాయతీల్లో 29,732 పోలింగ్ కేంద్రాలు, 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం, మీడియాతో గోపాలకృష్ణ ద్వివేది
మొత్తం 12 జిల్లాల్లో.. 2,724 గ్రామ పంచాయతీల్లో.. 29,732 పోలింగ్ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections 2021) నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Amaravati, Feb 8: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తం 12 జిల్లాల్లో.. 2,724 గ్రామ పంచాయతీల్లో.. 29,732 పోలింగ్ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections 2021) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన (Panchayat Raj Secretary Gopal Krishna Dwivedi ) మీడియాతో మాట్లాడుతూ.. 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు.
అన్నిచోట్లా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాస్కులు, గ్లోజులు, శానిటైజర్లు పంపిణీ చేశామని తెలిపారు. జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని, కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. 3 సైజులలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికలకు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తు కూడా ఉందని, నోటాకి పడిన ఓట్ల లెక్కింపు జరగదని పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 5 కి.మీ దాటిన చోట్ల 2,216 పెద్ద వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
ఇదిలా ఉంటే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వైఎస్సార్ జిల్లా పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆయనకు కంటి ఇన్ఫెక్షన్ కారణంగా పర్యటన రద్దు అయ్యింది. కంటి పరీక్షల కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి నిమ్మగడ్డ వెళ్లనున్నారు.