Pawan Kalyan on Sanatana Dharma: సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా రెడీ, తిరుపతి వారాహి సభలో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్‌కు పరోక్ష హెచ్చరిక!
ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.
Tirupati, Oct 3: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.
రామతీర్థంలో రాముడి తలనరికేస్తే ఏం చేశాం?... లోలోపలే తిట్టుకున్నాం... ఎందుకంటే, మన మాటలు ఎవరన్నా వింటే మనల్ని మతోన్మాదులు అనుకుంటారని భయం... అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళుతుంటారు... మనం భయంతో మాట్లాడం... ఈ దేశ మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు.
రాముడు ఉత్తరాది దేవుడా? మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు... నీలమేఘచ్ఛాయలో ఉంటాడు, కృష్ణుడు నీలమేఘచ్ఛాయలో ఉంటాడు, కాళికాదేవి నల్లని రంగులో ఉంటుంది అని పవన్ వివరించారు. సనాతన ధర్మానికి వర్ణ వివక్ష లేదు. ఇవన్నీ మెకాలే తీసుకువచ్చిన రంగులు. కుహనా లౌకికవాదులకు ఒకటే చెబుతున్నా... మీ సిద్ధాంతాలను మాపై రుద్దకండి. అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరాముడి ప్రతిష్ఠాకార్యక్రమం జరుగుతుంటే దేశ ప్రతిపక్ష నేత 'నాచ్ గానా' కార్యక్రమం అని అవమానించారు... దీనిని ఏ హిందువు కూడా ప్రశ్నించరా? మన రాముడిపై వాళ్లు జోకులు వేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? రామాయణం కల్పవృక్షం అంటే... కాదు, అది విషవృక్షం అన్నారు... మరి మాకు కోపాలు రావా?" అంటూ పవన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను బయటికి వచ్చి పోరాడతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని, డిప్యూటీ సీఎం పదవి పోయినా భయపడబోనని, ధర్మాన్ని రక్షించడం కోసం దేనికైనా సిద్ధమేనని అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ ప్రసంగించారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఆయన తమిళంలోనూ, ఆంగ్లంలోనూ ప్రసంగించారు "సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు...ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలకుంటే, వారే తుడిచిపెట్టుకుని పోతారు... తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా" అంటూ పవన్ హెచ్చరించారు. ఇక, సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సమర్థిస్తున్నాయని, సనాతన ధర్మంపై దాడులు చేస్తున్న వారిని కోర్టులు కాపాడుతుండడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
జగన్ ఇవాళ అమాయకుడిలా నటిస్తున్నాడని, కానీ గత ఐదేళ్లలో అతడు చేసిన పనులు, గతంలో అతడిపై ఉన్న అవినీతి కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. కోర్టులను అవమానించిన వ్యక్తి, జడ్జిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి, ఎన్నికల అధికారిని దూషించిన వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు వ్యవస్థలంటే గౌరవం లేదని, ఎన్నోసార్లు కోర్టులతో చీవాట్లు తిన్నాడని వివరించారు.
మాజీ సీఎం జగన్ పై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవని, చాలాకాలంగా పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. జగన్ పై 32 కేసులు ఉన్నాయి... అతడు జైల్లో 16 నెలలు ఉన్న వ్యక్తి... బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి... అలాంటి వ్యక్తిని నమ్ముతామా? అని ప్రశ్నించారు. జగన్ కేసులపై త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గౌరవ న్యాయస్థానాలను కోరుతున్నానని తెలిపారు.
ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది.. సరిదిద్దండి అని గతంలో చెప్పా. పట్టించు కోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి’’ అని అన్నారు.