Polavaram Project Row: ఏపీ ఆదాయం తగ్గింది..ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా? తెలంగాణ మంత్రి పువ్వాడ పోలవరం ప్రాజెక్టు వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఏపీ మంత్రి బొత్స
దీనిపై ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ (AP Minister botsa satyanarayana) స్పందించారు. పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు.
Amaravati, July 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో (Polavaram Project Row) భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేసిన సంగతి విదితమే. దీనిపై ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ (AP Minister botsa satyanarayana) స్పందించారు. పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?' అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరంతోనే భద్రాచలం మునిగిపోయిందనడం కరెక్ట్ కాదని సూచించారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయన్న అంబటి.. పోలవరం ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు. వరదల సమయంలో రాజకీయాలు తగవని మంత్రి అంబటి హితవు పలికారు.
పువ్వాడ అజయ్ ఏమన్నారంటే..
తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ (telangana minister puvvada ajay) మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్లు ఎత్తు పెంచుకున్నారు.. దీని వల్లే భద్రాచలానికి వరద వచ్చిందన్నారు. ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని మంత్రి పేర్కొన్నారు. వరదల నివారణకు ఆ ప్రాజెక్టు (Polavaram Reservoir Project) ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
భద్రాచలం ఇరు వైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన చర్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ. 1000 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన కేసీఆర్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఉన్న ముప్పును నివారించాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి తమ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని గుర్తు చేశారు.
పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు తాము నిరసన తెలిపామన్నారు. ఏపీలో విలీనం అయిన 7 మండలాలను తెలంగాణలో కలపాలి. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టి ఆమోదించాలని కోరారు. ముఖ్యంగా భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి. ఆ ఐదు గ్రామాల అంశంపై కేంద్రం ఆలోచించాలని మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.