Amaravati, July 19: సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని భావించిన జగన్ ప్రభుత్వం (CM YS Jagan Mohan Reddy Govt) కొత్తగా అర్హత ఉండి పథకాలు అప్లయి చేసుకున్నవారికి లబ్ది చేకూర్చేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలకు ( welfare benefits ) దరఖాస్తు చేసుకున్న వాళ్లకు తాజాగా పథకాలు మంజూరు చేసింది.
ఈ మేరకు కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) నగదు జమ చేయనున్నారు. మొత్తం 3.36 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతిఫలం అందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వైఎస్సార్ పింఛన్ కానుకకు కొత్తగా 2,99,085 మంది ఎంపికయ్యారు. కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసింది ఏపీ సర్కార్. గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. సచివాలయం విజిట్ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని సీఎం ప్రకటించారు. 10 రోజుల్లోపు గడప గడప చేసిన వారి పేర్లు సీఎం జగన్ చదివి వినిపించారు.