Ramachandrapuram Politics: ఆయన నాకు గురువుతో సమానం, బోస్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వేణుకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపిన ఎంపీ
సుభాష్ చంద్రబోస్ తనకు గురువుతో సమానమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడబోనని వేణు చెప్పారు.
Kakinada, July 24: రామచంద్రాపురం వైసీపీ (YCP)లో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ (Chelluboyina Venugopal), ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్‌కు ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపితే తాను సమర్ధించబోనని తేల్చిచెప్పారు.
పార్టీలో కూడా ఉండబోనని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం రామచంద్రాపురం నుంచి పోటీ చేయాలని క్యాడర్ కోరుకుంటోందని ఆయన చెప్పారు. పార్టీకి నష్టమైనా సరే తాను క్యాడర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. తమ కుటుంబానికి వైసీపీ నాయకత్వం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతామని తేల్చిచెప్పారు.
తాజాగా మంత్రి వేణు వర్గం వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రిగా వేణు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను సన్మానించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై తనకు సమాచారం లేదని పిల్లి సుభాష్ చెబుతున్నారు.
చెల్లుబోయినతో కలిసి కూర్చుని మాట్లాడే ప్రసక్తే లేదని సీఎం జగన్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు. ‘‘ఇక్కడ మా క్యాడర్‌ను మంత్రి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అవినీతి రాజ్యమేలుతోంది. క్యాడర్ అంతా అసంతృప్తితో ఉన్నారు. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది” అని అన్నారు. బలం ఉన్నంత సేపే ఇక్కడ గౌరవిస్తారని, క్యాడర్‌లో తాను బలహీనపడదల్చుకోలేదని చెప్పారు.
‘‘కార్యకర్తలు, క్యాడర్ వద్ద వేణు ఎన్ని రోజులు నటిస్తారు? మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తోనే ఉన్నాం. వేణు, నన్ను సమావేశపరుస్తానని సీఎం జగన్ చెప్పారు. క్యారెక్టర్ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పాను’’ అని పిల్లి సుభాష్ తెలిపారు. ప్రస్తుతం బోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ (Pilli Subhash Chandrabose) చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పందించారు. సుభాష్ చంద్రబోస్ తనకు గురువుతో సమానమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడబోనని వేణు చెప్పారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి (CM Jagan) ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా.. రామచంద్రపురంలో నియోజకవర్గ వైకాపా కార్యకర్తల ఆత్మీయ సమావేశం సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు.