Sajjala on YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు, సీబీఐ చార్జిషీట్‌ను కచ్చితంగా చాలెంజ్ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వ సలహాదారు
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, హత్య కేసు అంశానికి సంబంధించి ఎల్లో మీడియా అంతా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala on YS Viveka Murder Case) మండిపడ్డారు.
Amaravati, Feb 15: మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, హత్య కేసు అంశానికి సంబంధించి ఎల్లో మీడియా అంతా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala on YS Viveka Murder Case) మండిపడ్డారు. సీబీఐ చార్జిషీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అప్పుడు కుట్ర చేశారని, ఇప్పుడు అంతకంటే ఎక్కువ కుట్ర చేస్తున్నారని సజ్జల అన్నారు. బాధితులనే నిందితులుగా చేర్చే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐ చార్జిషీట్‌ను కచ్చితంగా చాలెంజ్ చేస్తామన్నారు. ఈ హత్య కేసులో ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. వివేకా హత్య కేసుకు (YS Viveka Murder case) సంబంధించి సీబీఐ చార్జిషీట్ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉందని, చార్జ్‌షీట్‌లో సంబంధం లేని వ్యక్తులపై కుట్ర జరుగుతుందన్నారు. ఈ రోజు మీడియాతో (Sajjala Press Meet) మాట్లాడిన సజ్జల.. ‘నాడు వివేకా హత్యకు ఎంత కుట్ర చేశారో.. నేడు అంతకంటే ఎక్కువ కుట్ర జరుగుతోంది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. వివేకా హత్య ఘటన వైఎస్ జగన్‌ను బాగా కుంగదీసింది.
సత్యదూరమైన, అసంబద్ధమైన కథనాలు ప్రచారం చేస్తున్నారు. హత్య అని తెలియజేసే లేఖను సాయంత్రం వరకూ ఎందుకు బయటపెట్టలేదు. మార్చి 15న ఘటన జరిగినప్పటి నుంచి మే30వరకూ టీడీపీ ప్రభుత్వమే ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కూడా అధికారులు కంటిన్యూ అయ్యారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి. సీబీఐ చార్జిషీట్ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉంది.
ఎంపీ టికెట్ కోసం వివేకా హత్య జరిగిందనే కోణంలో చార్జిషీట్‌లో కథనం రాయడం పూర్తి అసంబద్ధం. అవినాష్ గెలుపు కోసం చివరి క్షణం వరకూ వివేకా కృషి చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జ్‌షీట్ పేరుతో తప్పుడు కథనాలు, సత్యదూరమైన అసంబద్ధమైన కథనాలు ప్రసారం చేస్తున్నారు. కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీని, ఎంపీ అవినాష్‌ను అప్రతిష్ట పాల్జేసే కుట్ర. ఎల్లో మీడియా అంతా పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తోంది. చార్జిషీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు. ప్రతీదాన్ని రాజకీయం చేయడం టీడీపీకి అలవాటే. వివేకా హత్య వెనుక టీడీపీ హస్తం ఉండి ఉంటుంది. ఈ సోకాల్డ్ చార్జిషీట్ చూసిన తర్వాత అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలని అంతా కోరుకుంటున్నారు’ అని సజ్జల తెలిపారు.