Amaravati, Feb 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రముఖ నటుడు అలీ (Ali Meets Cm Ys Jagan) సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ను (Chief Minister YS Jagan Mohan Reddy) కలిశాను. త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని ఆయన చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాం. త్వరలోనే నా పదవిపై పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుంది.
రెండు వారాల్లోనే ప్రకటన ఉంటుందని అనుకుంటున్నాను.ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నా. సామాన్యులకు కూడా సినిమా టికెట్ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. చిన్న సినిమాకు కూడా లాభం ఉండాలన్నదే మా ఉద్దేశం అని అలీ (Actor Ali) అన్నారు. సీఎం సార్ పెళ్లి కాకముందు నుంచే వారి కుటుంబంతో తనకు పరిచయం ఉందని వెల్లడించారు. "మొన్న మా పెళ్లిరోజు నాడే సీఎంను కలుద్దామని అనుకున్నాం. కానీ వేరే మీటింగ్ ఉండడంతో రాలేకపోయాను. మా ఆవిడ కూడా సార్‌తో ఒక ఫోటో దిగాలని ఎప్పటినుంచో అడుగుతోంది. తప్పకుండా తీసుకెళతానని ఆమెకు ప్రామిస్ చేశాను. అది ఇవాళ కుదిరింది" అంటూ అలీ వివరణ ఇచ్చారు. సీఎంను కలవాలంటూ నిన్న ఆహ్వానం వచ్చిందని, అందుకే ఇవాళ కుటుంబంతో కలిసి వచ్చానని వివరించారు.
రాజ్యసభ సీటు గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని, అయినా తాను పదవి కోసం పార్టీలోకి రాలేదని అలీ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారని, అయితే సమయం లేక తానే వద్దన్నానని చెప్పారు. అయితే రెండు వారాల్లో పార్టీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన రావొచ్చని వెల్లడించారు. ఇటీవల టాలీవుడ్ ప్రముఖులను సీఎం జగన్ చర్చలకు పిలిచి అవమానించారన్న దాంట్లో నిజంలేదని అన్నారు. పిలిచి అవమానించాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు. చిరంజీవిని సీఎం ఎంతో గౌరవంగా చూశారని తెలిపారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు.