AP Local Polls Row: కరోనా తగ్గింది, ఎన్నికలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నాం, హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఏపీలో పనిచేస్తూ హైదరాబాద్‌లో అధికార నివాసం ఎందుకని ప్రశ్నించిన హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (State Election Commission) రెడీగా ఉందని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తనతో పాటు ఎన్నికల కమిషన్‌కు భద్రతను పెంచాలన్నారు.
Amaravati, Nov 4: కరోనావైరస్ కారణం చూపుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను (Local polls) వాయిదా వేయడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda Ramesh kumar) హైకోర్టుకు నివేదించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (State Election Commission) రెడీగా ఉందని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తనతో పాటు ఎన్నికల కమిషన్‌కు భద్రతను పెంచాలన్నారు.
ఆకస్మికంగా బ్యాలెట్ బాక్సుల కొరత తలెత్తిందని, ఏపీకి సొంతగా ఎలాంటి బ్యాలెట్ బాక్సులు లేవని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన (State Election Commissioner) కోర్టును కోరారు.ఇప్పటికే పూర్తయిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ఎన్నికలను రద్దు చేసి, వాటిపై విచారణ జరిపించే విషయంలో రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని వివరించారు. మొదటి దశలో ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుంటే, ఈసారి ఎన్నికల్లో మరింత ఎక్కువ హింస జరిగే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్, మరికొందరు గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు ఇటీవల సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇవి మరోసారి విచారణకు వచ్చాయి. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అదనపు కౌంటర్ దాఖలు చేశారు.
కరోనా తీవ్రత నేపథ్యంలో స్థానిక సంస్థలను అప్పుడు వాయిదా వేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. బిహార్‌లో తొలిదశ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. తెలంగాణలోనూ మున్సిపల్ ఎన్నికలను ప్రకటించిందని వివరించారు. కమిషన్ ఇటీవల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిందని, తగిన జాగ్రత్తలతో ఎన్నికలు కొనసాగించాలని రాజకీయ పార్టీలు కోరాయని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించామని, కరోనా సెకండ్ వేవ్ గురించి మౌఖికంగా తెలియచేశారని ఎస్ఈసీ కోర్టుకు తెలిపారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ (Andhra Pradesh High court) హైదరాబాద్‌లోని తన ఇంటిని తన అధికారిక నివాసంగా భావించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలా కోరడం వింతగా ఉందని తెలిపింది. ఎన్నికల కమిషనర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని, అలాంటప్పుడు హైదరాబాద్‌లోని తన నివాసాన్ని అధికారిక నివాసంగా భావించాలని కోరడం ఎంత మాత్రం అర్థంకాని విషయమని పేర్కొంది.
ఎన్నికల కమిషన్‌కు మంజూరు చేసిన రూ.40 లక్షలు విడుదల చేసేలా, ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ బట్టు దేవానంద్ (Justice B Devanand) మంగళవారం తీర్పు వెలువరించారు.
రాజ్యాంగ నిబంధనలకు, చట్టాలకు లోబడి విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన అభ్యర్థనల పట్ల ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. వ్యవస్థలే శాశ్వతం తప్ప, ఆయా హోదాల్లో ఉన్న వ్యక్తులు శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాదని, అది స్వతంత్ర హోదా కలిగిన వ్యవస్థ అన్నారు. ఎన్నికల కమిషన్ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమన్నారు.
ఆర్థిక, ఆర్థికేతర అంశాలకు సంబంధించి ఏ రకమైన సహాయ, సహకారం కావాలో మూడురోజుల్లో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను, వినతిపత్రం అందుకున్న తరువాత ఎన్నికల కమిషన్‌కు సహకారాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అమలయ్యేలా చూసి, అమలు విషయంలో 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రజాస్వామ్య పునాదులను సత్యం, న్యాయం ద్వారా నిలబెట్టేందుకు ఏర్పాటైన రాజ్యాంగ వ్యవస్థల మహత్తును, హుందాతనాన్ని, సమగ్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
గీతం విద్యాసంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణకు నిరాకరణ
విశాఖపట్నం గీతం విద్యాసంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరపడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వ భూముల్లో తాము చేపట్టిన నిర్మాణాల నుంచి తమను ఖాళీ చేయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న గీతం అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సబబుగానే ఉన్నాయని, అందులో ఏ రకంగానూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
తదుపరి కట్టడాలు, కూల్చివేతలు వద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు గీతం ప్రయోజనాలను కాపాడేలా ఉన్నాయని, అలాంటప్పుడు ఆ ఉత్తర్వులు ఎలా తప్పవుతాయని ప్రశ్నించింది. తదుపరి ఏం ఉత్తర్వులు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లాలని గీతం యాజమాన్యానికి స్పష్టం చేసింది.గీతం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తూ జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖ, రిషికొండ, యందాడ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమిని పెద్దమొత్తంలో ఆక్రమించిన గీతం యాజమాన్యం పలు నిర్మాణాలు చేపట్టిగా, కొన్నింటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీనిపై గీతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.