TTD: తిరుమలలో పటిష్ఠ నిఘా, చిన్నపాటి మైక్రో డ్రోన్‌లు కూడా పనిచేయకుండా నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్, బెల్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపిన ఈవో ధర్మారెడ్డి
చిన్నపాటి మైక్రో డ్రోన్‌లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్‌ఎడిఎస్)ను తిరుమలలో ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నట్లు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి (TTD EO AV Dharma Reddy) తెలిపారు.
Tirumala, Jan 23: చిన్నపాటి మైక్రో డ్రోన్‌లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్‌ఎడిఎస్)ను తిరుమలలో ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నట్లు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి (TTD EO AV Dharma Reddy) తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ యాంటీ డ్రోన్ సిస్టమ్ (Naval Anti-Drone System) కొనుగోలుపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)తో చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
భక్తులు డిపాజిట్ చేసిన లగేజిని సురక్షితంగా భద్రపరిచి తిరిగి అప్పగించేందుకు విమానాశ్రయాల తరహాలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. ఇందుకోసం ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగులు వినియోగిస్తామని, ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ఈ వ్యవస్థ అమల్లోకి రానుందన్నారు.
దేశవ్యాప్తంగా 396 టిటిడి కల్యాణ మండపాలు ఉన్నాయని, భక్తుల కోరిక మేరకు వీటిలో 12 కల్యాణ మండపాలను రూ.2.8కోట్లతో పూర్తిగా పునరుద్ధరించి, ఏసీ, ఫర్నీచర్ వసతులు కల్పించామని, తదనుగుణంగా మాత్రమే అద్దె పెంచామని ఈఓ వివరించారు. మిగిలిన 384 కల్యాణ మండపాల అద్దె పెంచలేదన్నారు. టాటా సంస్థ అందించిన రూ.150 కోట్ల విరాళంతో తిరుమలలో ప్రపంచ స్థాయి మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
టిటిడి చరిత్రలో మొదటిసారిగా, సుమారు 7,126 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 960 ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసామన్నారు. అదేవిధంగా, 2019లో రూ.13,025 కోట్లుగా ఉన్న టిటిడి బ్యాంకు డిపాజిట్లు ఇప్పుడు రూ.15,938 కోట్లు అని, బంగారం డిపాజిట్లు 7,339 కిలోల నుంచి 10,258 కిలోలకు పెరిగాయని వెల్లడించారు. తద్వారా టిటిడి పాలనలోని పారదర్శకతను, అంకితభావాన్ని తెలుసుకోవచ్చన్నారు.
టిటిడి పలు సామాజిక, సంక్షేమ చర్యలు చేపడుతోందని, పలు పాఠశాలలు, కళాశాలలతో పాటు చెవిటి, మూగ పాఠశాలలు, దివ్యాంగుల పాలిటెక్నిక్, పూర్‌హోమ్, వృద్ధాశ్రమం, అనాథ బాలబాలికల కోసం బాలమందిరం తదితర ప్రత్యేక సంస్థలను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పేదలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు. స్విమ్స్‌లో డిసెంబరు నాటికి ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కానుందని తెలిపారు. అదేవిధంగా, రూ.50 కోట్లతో హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిని అభివృద్ధి చేస్తున్నామని, రూ.23 కోట్లతో నూతన పరకామణి భవనం నిర్మించామని తెలియజేశారు.
మీడియా సమావేశంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)