AP Politics: 'జగన్ ప్రభుత్వానికి మానవత్వమే లేదు.. అక్రమ కేసులపై కోర్టులో పోరాడతాం'! సీఐడి విచారణకు హాజరైన ఏపి మాజీ మంత్రి దేవినేని ఉమ, వైకాపా ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ధూళిపాల్ల నరేంద్ర చేసిన తప్పేంటని నిలదీశారు.....
Vijayawada, April 29: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వీడియో మార్ఫింగ్ కేసులో టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వక్రీకరించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ వైఎస్‌ఆర్‌సిపి లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్.నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దేవినేని ఉమా మహేశ్వరరావుపై సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈరోజు సిఐడి విచారణ తర్వాత బయటకు అనంతరం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమ తాను సీఎం జగన్ మాటలను మార్ఫింగ్ చేసినట్లు తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి మానవత్వం లేదని ఆయన విమర్శించారు. అయితే తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, అక్రమ కేసులపై కోర్టుల్లో పోరాడతామని దేవినేని స్పష్టం చేశారు.
Devineni Uma Comments on Jagan Govt:
తాను జైలుకెళ్లినా తన గొంతునొక్కలేరని, జగన్ అక్రమాలపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానని దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ధూళిపాల్ల నరేంద్ర చేసిన తప్పేంటని నిలదీశారు. సంగం డైరీని అమూల్‌కు తాకట్టు పెట్టడానికి జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.